ఎప్పుడైనా చూశారా : ఎండకాలంలో తిరుమలలో మంచు దుప్పటి

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 03:26 AM IST
ఎప్పుడైనా చూశారా : ఎండకాలంలో తిరుమలలో మంచు దుప్పటి

తిరుమలలోని సప్తగిరులను మంచు కమ్మేసింది. ఒకవైపు పొగమంచు అందాలు.. మరోవైపు ఘాట్‌రోడ్డు  దృశ్యాలు.. కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. అయితే వీటిని చూసే భాగ్యం మాత్రం భక్తులకు లేకుండా పోయింది.పొగమంచులో తిరుమల ఎంతలా ఆకట్టుకుంటుందో.  ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో..
ఏపీ వ్యాప్తంగా 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం అకాల వర్షాలు కురిశాయి. తిరుపతి, తిరుమలలోనూ వర్షం పడింది. ఆ తర్వాతే తిరుమల కొండపై పొగమంచు కనువిందు చేస్తోంది. ఎటు చూసినా పొగమంచే కనిపిస్తోంది. ప్రధాన ఆలయం చుట్టూ కూడా మంచు దుప్పటి కప్పేసింది.

అలిపిరి నుంచి వెళ్లేదారిలోనూ పొగమంచు కప్పుకుంది. తిరుమలకు వెళ్లే దారిపొడవునా కనువిందు చేస్తోంది. ఘాట్‌ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు, శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాల్లో కూడా ఇదే వాతావరణం కనిపించింది., ఏడు కొండలను మొత్తం మంచు ఆవహించింది.  దీంతో తిరుమల కొండ కశ్మీర్‌, ఊటీలను తలపిస్తోంది.
తిరుమల కొండపై అలుముకున్న పొగమంచుతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలుకుతోంది.

కొండపైనున్న వారైతే ఈ ఆహ్లాదకర వాతావణాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ భక్తులకే ఆ భాగ్యం దక్కలేదు. లాక్‌డౌన్‌ పుణ్యమా అని తిరుమలకు భక్తులను నిషేధించారు. దీంతో తిరుమల కొండ కొన్ని రోజులుగా భక్తజనంలేక వెలవెలపోతోంది. మంచుదుప్పట్లో తిరుమల ఇంతలా ఆకట్టుకుంటున్నా దాన్ని ఆస్వాదించేందుకు భక్తులే లేకుండా పోయారు.

Also Read | దేశంలో కరోనా.. 6727కి చేరిన కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో!