AP కి భారీ వర్షసూచన…పులిచింతలకు పెరుగుతున్న వరద నీరు

  • Published By: murthy ,Published On : October 13, 2020 / 11:36 AM IST
AP కి భారీ వర్షసూచన…పులిచింతలకు పెరుగుతున్న వరద నీరు

peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్లుల్లోకి వరదనీరు వస్తోంది.

జూరాల
జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు 1,05,007 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1,62,440 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.8454 టీఎంసీలుంది.




శ్రీశైలం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 2,47.032 క్యూసెక్కులు వస్తుండడంతో శ్రీశైలం ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 2,22,750 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.80 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 214.84 టీఎంసీలు ఉంది.

నాగార్జున సాగర్‌
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లు పది ఫీట్ల మేర ఎత్తి దిగువకు విడుదల ప్రాజెక్టుకు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,76,778 క్యూసెక్కులు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు విడిచిపెడుతున్నారు.

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నిల్వ 589.5 అడుగులు మేర నీరుంది. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రాజెక్టులకు వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



పులిచింతల
పులిచింతల ప్రాజెక్టుకులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజి ఎగువన గల పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 2,50,000 క్యూసెక్కులు..ఆ వరద ప్రవాహం క్రమేణా పెరిగి 3 లక్షల నుంచి 3.5 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిచింతల వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 98,801 అవుట్ ఫ్లో 93,800 క్యూసెక్కులు గా ఉంది.

వరద ప్రవాహం పెరగనున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్  అధికారులను ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి….కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి….బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు…. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం
మరో వైపు ….పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిందని AP విపత్తుల శాఖ తెలిపింది. మరో నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని సూచించింది.

గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.