వణుకుతున్న విశాఖ : చెట్లు విరిగాయి, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 01:31 PM IST
వణుకుతున్న విశాఖ : చెట్లు విరిగాయి, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Heavy Rains Forecast : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ- నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.



షీల నగర్‌లో 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీల్లోని నీటిని మోటార్లతో జీవీఎంసీ సిబ్బంది తోడుతున్నారు. సహాయక చర్యలను జీవీఎంసి కమిషనర్ సృజన వర్షంలోనే పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు.



వాయుగుండం ప్రభావంతో విశాఖ వణికిపోతోంది. గడిచిన 24 గంటల్లో పరవాడలో అత్యధికంగా 18 సెంటీమీటర్లు, గాజువాకలో 17, భీమిలిలో 16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష ప్రభావంతో పాత గాజువాక జంక్షన్‌, కాన్వెంట్‌ జంక్షన్‌ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు నీటిలో వాహనాలు నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మోటార్‌ ఇంజిన్లతో జీవీఎంసీ సిబ్బంది నీటిని తోడుతున్నారు.



పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి సోమవారం తీవ్ర వాయుగుండంగా మారనుంది.



గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తోంది. సోమవారం రాత్రికి విశాఖ – నరసాపురం మధ్యం తీరందాటే అవకాశమున్నట్టు వాతావారణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. అటు రాయలసీమలో మోస్తరు ఉంచి భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది.



ఈనెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్‌ కూడా ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు సూచిక ఎగురవేశారు