తెలుగు రాష్ట్రాలకు అలర్ట్… రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు

  • Published By: naveen ,Published On : October 10, 2020 / 12:49 PM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్… రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు

heavy rains : బ‌ంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ‌నం కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబర్ 12న వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో వర్షాలు:
అల్పపీడన ప్రభావంతో ఇవాళ(అక్టోబర్ 10,2020) ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక ఆదివారం(అక్టోబర్ 11,2020) కూడా పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు:
రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ(అక్టోబర్ 10,2020) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రేపు(అక్టోబర్ 11,2020) చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కరీంనగర్, సిద్దిపేట, జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, మ‌హబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సోమవారం(అక్టోబర్ 12,2020) తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.