AP Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. నిండుకుండల్లా ప్రాజెక్ట్‌లు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలశయాలు నిండుకుండల్లా మారాయి.

AP Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. నిండుకుండల్లా ప్రాజెక్ట్‌లు

AP Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో వాన దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

మూడు రోజుల వరకు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి, అదే ప్రదేశంలో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ లో కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది.

మరోవైపు ఏపీలోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

ఉమ్మడి అనంతపురం జిల్లా.. ఈ పేరు చెబితేనే కరువు, కాటకాలు గుర్తుకొస్తాయి. పొట్టకూటి కోసం వలస పోయే కూలీలు, రైతుల కష్టాలు గుర్తుకొస్తాయి. వర్షాభావంతో బీడుబారిన భూములు, బక్కచిక్కిన పశువులు గుర్తుకొస్తాయి. తాగేందుకు చుక్క నీరు దొరక్క జనం అల్లాడే పరిస్థితి ఉండేది. దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాను ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.

వర్షాలతో ఉమ్మడి అనంతపురం జిల్లా పులకరించింది. కరువు సీమలో గంగమ్మ ఉరకలు కనిపిస్తున్నాయి. ఇసుక ఎడారి పెన్నాలో నీటి పరవళ్లు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల తర్వాత జలశయాలు నిండాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాపై వరుణుడు పగబట్టాడా? ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టుగా ఏకధాటిగా వర్షాలు కురిశాయి. కుండపోత వానలకు దశాబ్దకాలంగా చుక్క నీరు లేక ఎండిన నదులు సైతం ఉగ్రరూపం దాల్చాయి.

జిల్లాలోని అతిపెద్ద రిజర్వాయర్లు వరద నీటితో తొణికసలాడుతున్నాయి. దాదాపు అన్ని జలాశయాలకు వరద ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని వదిలారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పీఏబీఆర్ ఏడు గేట్లను ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీరంతా మిడ్ పెన్నార్ ప్రాజెక్టులోకి చేరుతోంది. మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ పది గేట్లు ఎత్తడంతో 20వేల క్యూసెక్కుల నీరు పెన్నా నదిలోకి చేరుతోంది. పేరూరు జలాశయం నుంచి ఏడు గేట్ల ద్వారా 27వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. చాగల్లు రిజర్వాయర్ లో 8 గేట్లను ఎత్తేయడంతో 22వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.

హన్మకొండ జిల్లా పరకాలలో భారీ వర్షాలకు చలివాగు ఉప్పొంగింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో కప్పలవాగు ఉప్పొంగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో వాటర్ లెవెల్ 1090 అడుగులకు చేరింది. కుండపోత వానలతో కడెం, నిజాంసాగర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంటకు నష్టం చేకూరుతోంది. దీంతో అన్నదాతలు ఆవేదనగా ఉన్నారు.