Heavy Rains : వానలే వానలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు… పొంగిపొర్లుతన్న వాగులు, వంకలు

రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.

Heavy Rains : వానలే వానలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు… పొంగిపొర్లుతన్న వాగులు, వంకలు

Heavy Rains

Heavy Rains : రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సంగమేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో సంగమేశ్వర ఆలయంలో వరద జలాలు శివలింగాన్ని తాకాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతుంటే… బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రాత్రి నుంచి హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం పడుతోంది.

ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 233.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ భైంసాలో 227.5 మి.మీ వర్షం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో 173.5 మి.మీ వర్షం, ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో 153 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 100 మి.మీ కు పైగా వర్షపాతం నమోదైంది.

రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వాన కురుస్తోంది.

ఏపీలో ఐదు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకూ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు.

వచ్చే 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వీటి ప్రభావం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నాయని.. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇలాగే వర్షాలు పడతాయని వివరించారు. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గరిష్టంగా 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే తూర్పు గోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని వరరామచంద్రపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో 7, కొత్తపల్లిలో 5.4, ఆత్మకూరులో 5.3, విజయనగరం జిల్లా తెర్లాం, బొండపల్లి, మెరకముడిదం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, రణస్థలంలలో 5, కృష్ణా జిల్లా గన్నవరంలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షం కురిసింది.