రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 03:54 PM IST
రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలపింది. అలాగే వాయువ్య బంగాళఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.



విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయు గుండం ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలో రెండు రోజులు వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గోదావరికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లోతట్టు లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.



ఇవాళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుముదురుగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.