భారీ వర్షాలు..ప్రాజెక్టులు ఫుల్

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 09:52 AM IST
భారీ వర్షాలు..ప్రాజెక్టులు ఫుల్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.




జూరాల 11 గేట్లు
జూరాల 11 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేస్తుండగా.. నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీరామ్‌ సాగర్‌
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 74 వేల 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 16 గేట్లు తెరిచి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు, కెనాల్స్‌ ద్వారా వచ్చిన వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.




సామర్థ్యం 90.31 టీఎంసీలు
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదతో.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం అంతే మొత్తంలో ప్రాజెక్టులో నీరు ఉంది.
https://10tv.in/heavy-rain-alert-for-andhra-pradesh-telangana/
జూరాల జలాశయానికి
జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది.లక్షా 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 17 గేట్లు ఎత్తి… లక్షా 48 వేల 925 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో.. కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళను సంతరించుకున్నాయి.రెండు రోజులుగా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.




సాగర్‌ 14 క్రస్ట్‌ గేట్లు
సాగర్‌ 14 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువను నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 2 లక్షల 48 వేల 266 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. మొత్తం నీటిని కిందికి వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.12 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 310.84 టీఎంసీలుగా ఉంది.

రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు
భారీ వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి.. సిరిసిల్లలోని పాతబస్టాండ్ వద్ద ప్రధాన రహదారి జలమయమైంది. వర్షపు నీటి వరదతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సంజీవయ్యనగర్ కమాన్ వద్ద సెల్లార్లలోకి డ్రైనేజీ నీళ్లు చేరడంతో.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్త చెరువు వరద నీటితో నిండుకుండలా మారింది. చెరువులోకి వర్షపు నీరు చేరుతుండటంతో.. మత్తడి దూకుతూ ప్రధాన రహదారిపై నుండి నీరు పారుతోంది.





ప్రజల ముప్పు తిప్పలు
ఎడతెరిపి లేని వర్షాలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. జగిత్యాలలో రాత్రి కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతలు జలమయమయ్యాయి. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు పొంగి, చెరువులు మత్తడి దూకుతుండడంతో ధర్మపురి, సారంగపూర్‌తో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.