హాలో జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..మోడీ ఫోన్

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 06:10 AM IST
హాలో జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..మోడీ ఫోన్

హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు.

కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ క్రమంలో 2020, జులై 19వ తేదీ ఆదివారం ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు.

కరోనా వ్యాప్తి, నియంత్రణ..తదితర వివరాలపై చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు సీఎం పళని స్వామితో పాటు బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు.

మరోవైపు ఏపీలో కరోనా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పరీక్షల సంఖ్యను మాత్రం పెంచుతున్నారు. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాజిటివ్ కేసులు సంఖ్య వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా నిర్ధారణ పరీక్షలు 13 లక్షల మార్కును దాటాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 31 వేల 148 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 13, 15, 532కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 5 వేల 041 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49 వేల 650కి చేరాయి. 1, 127 మంది వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 22 వేల 890కి చేరాయి. తాజాగా 56 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 642కి చేరాయి.