పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

  • Published By: vamsi ,Published On : December 3, 2020 / 01:35 PM IST
పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ చేసిన ప్రకటనపై పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.



ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారంటూ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొనగా.. పిటిషన్‌లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం అందులో పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పిటీషనర్ వెల్లడించగా.. ఇప్పటికే కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది మరణించారని, ఇటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగితే ప్రజారోగ్యంకి మంచిది కాదని పిటీషన్‌లో వెల్లడించింది ప్రభుత్వం.



ఎలక్షన్ కమిషన్ గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే ప్రభుత్వం అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.