Chintakayala Vijay : వస్తారా? రారా? చింతకాయల విజయ్ సీడీఐ విచారణపై ఉత్కంఠ, డీజీపీ కార్యాలయం దగ్గర హైటెన్షన్

టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఐడీ విచారణకు ఇంతవరకు విజయ్ హాజరుకాలేదు. దీంతో విజయ్ కోసం సీఐడీ అధికారులు ఎదురుచూస్తున్నారు.

Chintakayala Vijay : వస్తారా? రారా? చింతకాయల విజయ్ సీడీఐ విచారణపై ఉత్కంఠ, డీజీపీ కార్యాలయం దగ్గర హైటెన్షన్

Chintakayala Vijay : టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు, టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఐడీ విచారణకు ఇంతవరకు విజయ్ హాజరుకాలేదు. దీంతో విజయ్ కోసం సీఐడీ అధికారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయ్ విచారణకు హాజరుకారని టీడీపీ నేతలు అంటున్నారు.

విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామంటున్నారు సీఐడీ అధికారులు. దీంతో డీజీపీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, టీడీపీ నేతలు భారీగా మోహరించారు.

సీఎం జగన్ సతీమణి భారతిపై పెట్టిన పోస్టు వ్యవహారంలో సీఐడీ పోలీసులు ఇటీవలే చింతకాయల విజయ్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడే ఈ చింతకాయల విజయ్. ఐటీ నిపుణుడైన విజయ్ కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటూ టీడీపీ సోషల్ మీడియా వ్యూహాల్లో కీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందే టీడీపీ సాంకేతిక వ్యూహాల్లో కీలకంగా మారిన చింతకాయల విజయ్ గురించి పార్టీ కార్యకర్తలందరికీ తెలియకపోయినా ప్రధాన నేతలకు మాత్రం తెలుసు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కోసం సోషల్ వ్యూహాలు రూపొందించినా అప్పట్లో వైసీపీ హవా కారణంగా విజయ్ ప్రతిభ వెలుగు చూడలేదు. అందులోనూ ప్రత్యర్ధి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు పనిచేస్తున్న సమయంలో అధికార టీడీపీని పోటీగా నిలబెట్టడంలో కాస్త వెనుకబడ్డా… టీడీపీ విపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం విజయ్ పేరు మార్మోగుతోంది.

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ లో బహిరంగంగా సాగే విమర్శలతో పాటు సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారిపోయింది. దీంతో విపక్ష టీడీపీని ఆ విషయంలో వైసీపీ కంటే పైచేయి సాధించిపెట్టేలా చేయడంలో విజయ్ కీలకపాత్ర పోషించారు. 2019 కంటే ముందు టీడీపీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి సోషల్ మీడియా వ్యూహాలు, ప్రచారం కోసం ప్రారంభించిన విభాగం ఐటీడీపీని నడిపిస్తోంది చింతకాయల విజయ్ అని సమాచారం.

పార్టీలో గల్లా జయదేవ్ వంటి మరికొందరు నేతలతో కలిసి విజయ్ నడిపిస్తున్న ఐటీడీపీ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఉపయోగపడకపోయినా.. అధికారం కోల్పోయాక టీడీపీకి మాత్రం ఎంతో ఉపయోగపడుతోందని అంటున్నారు. ఐటీడీపీ ద్వారా పంపుతున్న పోస్టులనే టీడీపీ స్ధానిక క్యాడర్ జనంలోకి షేర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తోంది.

ఇది ఇలా ఉంటే.. చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో పోస్టులు పెట్టాడని వైసీపీ నేతలు ఆరోపించారు. విజయ్ తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ విచారణకు హాజరవ్వాలని, వారు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పాలన్నారు.