బ్రేక్ పడేనా! : మత్స్యకారుల మధ్య వివాదం, రంగంలోకి మోపిదేవి

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 07:30 AM IST
బ్రేక్ పడేనా! : మత్స్యకారుల మధ్య వివాదం, రంగంలోకి మోపిదేవి

High tension in Chirala Sea : ప్రకాశం జిల్లా చీరాలలోని మత్స్యకార గ్రామాలైన వాడరేవు, కఠారీపాలెం, రామాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్స్యకారుల మధ్య విబేధాలు తగ్గడం లేదు. రోజు రోజుకు అవి ముదురుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన అగ్గి రాజుకుంటూనే ఉంది. విబేధాలు తార స్థాయికి చేరాయి. అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి.

అంతకంతకు పెరుగుతున్న గొడవలు : –
బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య గొడవలు అంతకంతకూ పెరుగుతుండడంతో… ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. మరోసారి మత్స్యకారుల గ్రామాల్లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో ఇక మోపిదేవి వెంకటరమణ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం ఆయన మత్స్యకారులతో భేటీ అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన వారితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా తీర ప్రాంత మత్స్యకారులు పాల్గొననున్నారు. సమస్య పరిష్కారం కోసం మోపిదేవి ఇరుగ్రామాల మత్స్యకార పెద్దలు,అధికారులతో మాట్లాడనున్నారు. మత్స్యకారుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరిస్తామని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు. ఇరువర్గాలతో సామరస్యపూర్కకంగా చర్చించి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతామన్నారు. ఇప్పటికే పలుమార్లు మత్స్యకారులతో తాను మాట్లాడానని చెప్పారు.

ఏం జరుగుతుందోనన్న టెన్షన్ : –
ఆదివారం కూడా మత్స్యకార గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం కొనసాగింది. రామాపురం, వాడరేవు, కఠారీపాలెం మత్స్యకారులు దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్తత ఏర్పడింది. రామాపురం వైపు కర్రలతో వాడరేవు మత్స్యకారులు బయలుదేరగా…. ప్రతిదాడి చేసేందుకు కఠారీపాలెం మత్స్యకారులు ఎదురెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు… రెండు గ్రామాల్లోని పికెటింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇరువర్గాలను ఎక్కడికక్కడే అడ్డుకుని వెనక్కు పంపించే ప్రయత్నం చేశారు. బల్లవల, ఐలవల దగ్గర మొదలైన గొడవ రోజురోజుకు పెద్దదవుతుండడంతో.. మత్స్యకార గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కఠారిపాలెం – వాడరేవు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతుండడంతో.. పోలీస్‌ పికెటింగ్‌ కొనసాగుతోంది. గ్రామాల్లో స్పెషల్ టీమ్‌లు, ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్‌, సివిల్ పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. సాధారణ పరిస్థితి వచ్చేంత వరకు పికెటింగ్‌ కొనసాగుతుందని ఏఎస్పీ రవిచంద్ర చెప్పారు. మరోవైపు వాడరేవులో జరిగిన ఘర్షణతో సంబంధం ఉన్న 22 మందిని గుర్తించిన పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు.