టెన్షన్ టెన్షన్ : 20వాహనాలతో కాకినాడకు పవన్.. భారీగా చేరుకుంటున్న జనసైనికులు

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 09:33 AM IST
టెన్షన్ టెన్షన్ : 20వాహనాలతో కాకినాడకు పవన్.. భారీగా చేరుకుంటున్న జనసైనికులు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి 20 వాహనాలతో కాకినాడ బయలుదేరారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకుంటున్నారు. అటు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. ఇటు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. కాగా తునిలో పవన్ కు చెందిన 10 వాహనాలను పోలీసులు ఆపేశారు. తుని, ప్రత్తిపాడు దగ్గర జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు. పవన్ రానున్న నానాజీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాకినాడలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రధాన రోడ్లన్నీ బారికేడ్లతో మూసేశారు పోలీసులు. వాహనదారులను సైతం అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై కాకినాడ వాసులు మండిపడుతున్నారు.

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆరా తీసి పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం మధ్యలోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడ రెండు రోజులు ఉన్నారు. ఇవాళ(జనవరి 14,2020) విశాఖకు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకు పయనం అయ్యారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. బూతులు తిట్టారు. దీంతో జనసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ద్వారంపూడి ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ద్వారంపూడి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో జనసైనికులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు జనసేన నేతలపైనే కేసులు పెట్టడం వివాదానికి దారితీసింది.

దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనలో వైసీపీ నాయకులని వదిలేసి, జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెడితే ఢిల్లీ మీటింగ్ ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటా… అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇవాళ కాకినాడలో ఎటువంటి పరిణామాలు చోటు సుకుంటాయో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

* కాకినాడలో హై టెన్షన్
* విశాఖ నుంచి కాకినాడకు 30 వాహనాలతో బయలుదేరిన పవన్
* పవన్ తో పాటు కాకినాడకు భారీగా జనసేన కార్యకర్తలు
* పవన్ కాన్వాయ్ లో కొన్ని వాహనాలను మధ్యలోనే ఆపేసిన పోలీసులు
* అనధికారిక కర్ఫ్యూతో కాకినాడలో రోడ్లు నిర్మానుష్యం
* ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు
* కాకినాడ సిటీలో 800మంది పోలీసుల బందోబస్తు

Also Read : బిగ్ బ్రేకింగ్ : బీజేపీతో జనసేన పొత్తు..?