ముందుకా వెనక్కా : రోడ్డుపై కూర్చొన్న బాబు

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 09:54 AM IST
ముందుకా వెనక్కా : రోడ్డుపై కూర్చొన్న బాబు

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్‌పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో హోరెత్తించారు. అటు చంద్రబాబు కూడా వెనక్కి తగ్గేదిలేదన్నారు. తన వాహనాన్ని అడ్డుకోవడంతో కాలినడకన బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. 

వైసీపీ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తడంతో చంద్రబాబుకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆయనను తిరిగి ఎయిర్‌పోర్ట్ లాబీలోకి పంపేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు అక్కడే రోడ్డు మీద ధర్నాకు దిగారు. దీంతో ఎయిపోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అటు బాబు, ఇటు వైసీపీ ఎవరూ వెనక్కితగ్గడం లేదు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని బాబు వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

See Also>>ప్రజా చైతన్య యాత్ర జరిగేనా : విశాఖ ఎయిర్ పోర్టులోనే బాబు

పోటాపోటీగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాహనంలో ఎయిర్ పోర్టుకు తరలించి..అక్కడి నుంచి విజయవాడకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఏడీ ప్రాంతం మీదుగా పెందుర్తి మీదుగా బాబు వెళ్లాల్సి ఉంటుంది.

కానీ..ఈ మార్గాల్లో వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. బాబు ముందుకు వెళితే..మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్త అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా..నెరవేరే అవకాశం లేదని..మరో రోజును నిర్ణయించుకోవాలని బాబుకు పోలీసులు సూచిస్తున్నారు. విజయవాడకు వెళ్లిపోతేనే..శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని, ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. కానీ బాబు ముందుకు వెళుతారా ? లేక వెనక్కి వెళుతారా ? అనేది చూడాల్సి ఉంది. 

Read More : ముకేశ్ అంబానీ గంటకు ఆదాయం ఎంతో తెలుసా