కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన మహిళకు అవమానం, ఇంటి నుంచి గెంటేసిన యజమాని

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 05:23 AM IST
కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన మహిళకు అవమానం, ఇంటి నుంచి గెంటేసిన యజమాని

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మహిళకు అవమానం జరిగింది. ఆమె పట్ల ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని. అంతేకాదు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాడు. ఇంటికి తాళం వేసుకుని అతడు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆ మహిళ బిత్తరపోయింది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది. బాధితురాలు తహశీల్దార్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తుంది. ఈ విషయం తెలుకున్న తహశీల్దార్ జరీనా.. బాధితురాలిని చేరదీసింది. ఆమెకు మరో చోట ఆశ్రయం కల్పించింది.

యుద్ధం చేయాల్సింది కరోనాపై, కరోనా రోగిపై కాదు:
ఈ ఘటన చర్చకు దారితీసింది. ఇంటి యజమాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. కరోనా బాధితుల పట్ల వివక్ష చూపకూడదని చెబుతున్నారు. మనం యుద్ధం చేయాల్సింది కరోనా మహమ్మారిపై కరోనా బాధితులపై కాదు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కరోనాపై భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వాలు నెత్తీ నోరు బాదుకుంటున్నా కొందరు వ్యక్తులు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. కరోనా రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకుని వచ్చిన వ్యక్తులను చూసి కొందరు భయపడుతున్నారు. తమకు కరోనా సోకుతుందేమోననే అనుమానంతో కూడిన భయంతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇంటి యజమాని కూడా ఇలానే భయపడి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని, ఆ ఇంటి యజమానికి నచ్చ చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. కరోనాపై ఆ ఇంటి యజమానికి అవగాహన కల్పించి, ఆయనలో ఉన్న భయాలు తొలగించి, ఆ మహిళను తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందని అంటున్నారు.

Also Read | కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణం : కేంద్రం