62 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం ఎలా కాలిపోయింది ?

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 07:37 AM IST
62 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం ఎలా కాలిపోయింది ?

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాగణంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం ఎలా జరిగింది? 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం అగ్ని ఎలా ఆహుతైంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా ఆకతాయిల పనా ? తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు అగ్నికి ఆహుతైంది.
https://10tv.in/metro-runs-things-travelers-need-to-know/
షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేక ఆకతాయిల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రథం దగ్ధం ఘటన దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని.. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నామన్నారు




సీఐ దుర్గాశేఖర్‌ రెడ్డి. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. భక్తులు పెట్టే నిప్పుల కుంపటే ప్రమాదానికి కారణమా? లేక షార్ట్ సర్క్యూటా అన్న కోణంలోనూ విచారిస్తున్నారమన్నారు. శ్రీలక్ష్మి నర్సింహ్మస్వామి రథం అగ్నికి ఆహుతి ఘటనపై గ్రామస్తులు, వీహెచ్‌పీ, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయం ముందు ఆందోళన చేశారు. ఈవో నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. సీసీ కెమెరాలు ఆరునెలలుగా పనిచేయకుంటే ఎందుకు రిపేర్ చేయించలేదని ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రథం దగ్ధంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు విచారం వ్యక్తం చేశారు.




సమగ్ర విచారణ జరిపేందుకు దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను నియమించారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆకతాయిల పనిగా తేలితే కఠినంగా శిక్షిస్తామన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. వచ్చే కళ్యాణోత్సవం నాటికి.. కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్నారు.

ఉత్సవ రథం కాలి బూడిదవ్వడాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు.




రథం అగ్నిప్రమాదం ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన కాదని.. అరాచక శక్తుల దుశ్చర్యగా కథనాలు రావడంపై టీడీపీ సీరియస్‌ అయింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజ నిర్దారణ కమిటి అంతర్వేది సందర్శించనుంది. ఈ కమిటిలో సభ్యులుగా నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు ఉండనున్నారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో ప్రార్ధనా మందిరాలు, దేవాలయాల ప్రాంగణాల్లో ఇటువంటి ఘటనలు జరడగాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది.