నేను మళ్లీ చెబుతున్నా.. కన్నా, సుజనా అమ్ముడుబోయారు.. కాణిపాకమే కాదు.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తా

  • Published By: sreehari ,Published On : April 21, 2020 / 08:18 AM IST
నేను మళ్లీ చెబుతున్నా.. కన్నా, సుజనా అమ్ముడుబోయారు.. కాణిపాకమే కాదు.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తా

ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లకు కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.

బీజేపీకి చెందిన కన్నా, సుజనా చౌదరిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి. కన్నా ఓ అవినీతి పౌరుడని, రూ. 20 కోట్లకు అమ్ముడు పోయాడని విజయసాయి ఆరోపించారు. సుజనా, కన్నా అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తారా? అని సూటిగా విజయసాయి ప్రశ్నించారు. 

కాణిపాకం, వెంకన్న సాక్షిగా నేను ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నా ఆరాధ్య దైవం వెంకటేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పారు. కన్నా, సుజనా చౌదరికి ప్రశ్నించే అర్హత లేదన్నారు.

సుజనా చౌదరి బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. సుజనాకు ఎన్ని బోగస్ కంపెనీలు ఉన్నాయో ఆధారాలున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఎంత ఇచ్చిందో దాంట్లో కన్నా ఎంత తీసుకున్నారో తెలుసునని విజయసాయి తెలిపారు.

పురంధేశ్వరి ఎంత తీసుకుని ఎలా దుర్వినియోగం చేసిందో తనకు తెలుసునని విజయసాయి ఆరోపణలు చేశారు. సుజనా చౌదరి దొంగ కంపెనీలు సృష్టించి బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టారని అన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలోనే బట్టబయలు చేస్తామని చెప్పారు. కరోనా టెస్టు కిట్లపై కన్నా లక్ష్మినారాయణ చేసిన ట్వీట్లతో వైసీపీ, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ట్విట్టర్ లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.