ప్రతి నియోజకవర్గం జిల్లా అయితే నష్టపోయేవి ఆ రెండే..

ప్రతి నియోజకవర్గం జిల్లా అయితే నష్టపోయేవి ఆ రెండే..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫేస్టోలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. వాటిలో ఒకటైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే ముందుకెళ్లబోతోంది. దీంతో ప్రకాశం జిల్లాలో తమ ప్రాంతాన్నంటే తమ ప్రాంతాన్నే జిల్లాగా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. గతంలోనే ప్రాంతీయ వాదం పుట్టినప్పటికీ కాలయాపన కావడంతో సైలెంట్‌గా ఉన్న జేఏసీలు ప్రస్తుతం అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారంతో ప్రాంతీయవాద గళాన్ని విప్పేందుకు మరోసారి ఉద్యమ బాట పట్టాయి.

జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని కమ్యూనిస్టుల పురిటిగడ్డయిన మార్కాపురం, స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించిన చీరాల ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా డిమాండ్ మరింతగా ఊపందుకొంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తిగా తమ చీరాలను జిల్లా చేయవలసిందేనని, చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చీరాల జేఏసీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వం సీరియస్‌గా జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించడంతో జిల్లాలో అధికారులు భౌగోళిక, నైసర్గిక స్వరూప రికార్డులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు, బాపట్ల, నెల్లూరు పార్లమెంట్‌ నియోజవకర్గాల పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో చిక్కుముడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకాశం జిల్లాని మూడు జిల్లాలుగా చేస్తుందా? లేక రెండుగా ఉంచుతుందా అనేది అధికారులకు సైతం స్పష్టత లేదంటున్నారు.

ప్రకాశం జిల్లాగా ఏర్పడడానికి ముందు దర్శి, చీరాల, ఒంగోలు, పర్చూర్, సంత నూతలపాడు నియోజకవర్గ ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఉండేవి. అదే విధంగా కొండెపి, కందుకూరు, సింగరాయకొండ, కనిగిరి ప్రాంతాలు నెల్లూరు జిల్లాలో ఉండేవి. ఆనాటి దత్తమండలాలైన మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో ఉండేవి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాగా ఏర్పడిన ప్రాంతాలన్నీ గతంలో ఉన్న జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి.

కాకపోతే ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనుండటంతో వాటి పేర్లు మాత్రమే మారనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం ప్రజలు, మేధావుల నుంచి జిల్లా నైసర్గిక పరిస్థితులపై పలు అనుమానాలు నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో వీటిపై కసరత్తు చేసేందుకు నియోజకవర్గాల వారిగా అధికారులు భౌగోళిక పరిస్థితులు, విస్తీర్ణం, దూరం ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించినట్లు చెబుతున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన బాపట్ల, వేమూరు, రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రకాశంజిల్లా పరిధిలోని చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు వంటి ఏడు నియోజక వర్గాలు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే చీరాల నియోజకవర్గం మాత్రమే అన్నిటి కన్నా అభివృద్దిలో ముందుంది. దీంతోపాటు బ్రిటిష్‌ హయాంలో ఏర్పడ్డ మున్సిపాలిటీ, ఓడరేవు, సముద్ర తీర ప్రాంతం, బస్, రైల్వేస్టేషన్, చేనేత ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు, జీడిపప్పు పరిశ్రమలతో చిన్న మొంబైగా పేరొందింది.

1957లోనే చీరాల జిల్లా ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. స్థానిక పరిస్థితులు, పార్లమెంట్ నియోజకవర్గాల మధ్య ఉన్న దూరం, స్థానికంగా భౌతిక వనరులను పరిగణనలోకి తీసుకొని చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించి దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పేరును పెట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. మరోవైపు భౌతిక వనరులు ఉండి కూడా వెనుకబాటుతనానికి గురై 1952లో పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ మరో జాయింట్‌ యాక్షన్ కమిటీ ఏర్పడింది.

జాతీయ రహదారులు, వెలుగొండ ప్రాజెక్ట్, రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఏర్పడ్డ దొనకొండ విమానాశ్రయం, దొనకొండ పారిశ్రామిక హాబ్ వంటి మెరుగైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ఆ కమిటీ అంటోంది. ఒంగోలుకు వెళ్లాలంటే చాలా దూరం కావడంతో మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని ఎప్పటి నుంచో కోరుతోంది.

వీటన్నింటి పరిస్థితి ఇలా ఉంటే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కందుకూరు నియోజకవర్గం మాత్రమే ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్తుంది. అందుకు కందుకూరు వాసులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరాలుగా ప్రకాశం జిల్లాతో పెనవేసుకున్న తమ బంధాన్ని తెంచుకోలేమంటూ సెంటిమెంటు రగిలిస్తున్నారు.

భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బట్టి చూస్తే జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ ప్రాంతానికీ మధ్యలో ఉండేలా లేవు. దీంతో ప్రభుత్వ నిర్ణయం… జిల్లాల ఏర్పాటు కసరత్తు… భౌగోళిక నైసర్గిక స్వరూపాల పరిధి ఎలా ఉంటుందనే చర్చ జిల్లాలో నడుస్తోంది.

మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాలు బాపట్ల, నెల్లూరులో చేర్చినట్లైతే ప్రకాశం జిల్లా ఆర్ధికంగా, పారిశ్రామికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని ప్రజాసంఘాలు అంటున్నాయి. జిల్లాలో ప్రధాన ఆధాయ వనరైన చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలు, చీరాలలోని చేనేత, జీడి పరిశ్రమలు, ఇండ్రస్ట్రియల్ గ్రోత్ సెంటర్, కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం వంటి భారీ పరిశ్రమలు ఇతర జిల్లాల పరిధిలోకి పోతాయి. దీంతో ఒంగోలులో ఇక మూలనపడ్డ పలకల పరిశ్రమ, నిత్యం అతివృష్టి, అనావృష్టితో ముక్కి మూలిగే పోడు వ్యవసాయం, నల్లమల తప్ప చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు ఉండవని అంటున్నారు. దీంతో జిల్లా విభజన జరిగినట్లేతే ప్రకాశం జిల్లా పూర్తిస్థాయిలో వెనుకబడి చీకటిమయంగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంల్లో ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ వినిపిస్తోంది.