20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస్తామంటూ మోసం?

  • Published By: madhu ,Published On : October 5, 2020 / 03:18 PM IST
20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస్తామంటూ మోసం?

if-you-give-tvs-and-radios : లాక్ డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. మార్కెట్లో సడన్‌గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు.. వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస్తామని.. కొన్ని ముఠాలు బంపరాఫర్లు ఇస్తున్నాయి. అయినా.. పాత టీవీల్లో కొత్తగా ఇప్పుడేం కనిపించింది. ఇది కొత్త తరహా మోసమా.. నిజంగానే కోట్లు కురిపించే అవకాశమా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.



మీ దగ్గర పాత కాలం నాటి టీవీ ఉందా.. ఆనాటి రేడియో ఉందా.. తిరుపతి మార్కెట్లో.. టీవీ మెకానిక్‌లతో పాటు మిగతా జనాలకు ఎదురవుతున్న ప్రశ్నలివి. పాత టీవీలు, రేడియోలు ఇస్తే చాలు.. లక్షలు, కోట్లు ఇచ్చి మరీ కొనేందుకు రెడీగా ఉన్నాయి కొన్ని ముఠాలు. ఇంతకీ.. పాత టీవీలో ఏముందని.. ఇంత డబ్బులు ఆఫర్ చేస్తున్నారనే సందేహం తలెత్తుతోంది. పాత టీవీలు, రేడియోల్లో ఉన్న రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ కోసమే ఈ ప్రయత్నాలు, బంపరాఫర్లు. నిజానికి.. దాని వల్ల ఉన్న ఉపయోగమేంటో.. ఎవరికీ తెలియదు. కానీ.. ఇప్పుడు చాలా మందికి ఆ రెడ్ మెర్క్యూరీ కావాలి.



రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ గురించి.. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో.. పబ్లిక్ అంతా ఈ మెర్క్యూరీ మాయలో పడిపోయారు. కొన్ని ముఠాలు.. తమ దగ్గర ఉందంటే.. తమ దగ్గర ఉందని ప్రచారం చేస్తూ మోసాలకు దిగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో.. దీనిపై బాగా ప్రచారం జరుగుతోంది. అది కాస్తా.. ఇప్పుడు చిత్తూరు దాకా చేరింది. తిరుపతిని కూడా ఊపేస్తోంది.



ఇదే.. రెడ్ మెర్క్యూరీ.. క్లియర్‌గా చెప్పాలంటే.. ఎర్రని పాదరసం. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోల్లో.. ఈ రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ వాడేవారు. దీనికే.. ఇప్పుడు ఓ రేంజ్‌లో డిమాండ్ పెరిగిపోయింది. అణుబాంబుల తయారీలో దీనిని వాడతారని కొందరు.. కరోనా చికిత్సకు వాడతారని మరికొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫిలమెంట్‌లో ఉండే రెడ్ మెర్క్యూరీ కోసం.. కొన్ని ముఠాలు కోట్లు ఇస్తామంటూ తిరుగుతున్నాయి.



ఇది బాగా ప్రచారంలోకి రావడంతో.. జనమంతా.. టీవీ మెకానిక్‌ల షాప్‌ల చుట్టూ తిరుగుతున్నారు. పాత టీవీలు, రేడియోల కోసం మెకానిక్‌ షాప్‌ల చుట్టే కాదు.. ఆన్‌లైన్‌లోనూ తెగ వెతికేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లలో వాటి ధరలు చూస్తే.. దిమ్మతిరుగుతోంది. కొందరేమో.. పాత టీవీలు, రేడియాలు కావాలంటూ యాడ్స్ ఇస్తున్నారు. ఇంకొందరేమా.. మీకు కావాల్సిన పాత టీవీలు మా దగ్గరున్నాయంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.



కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముఠాలు.. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదంతా.. ఒక ఎత్తైతే రెడ్ మెర్క్యూరీలో మళ్లీ ఒరిజినల్స్, డూప్లికేట్స్ కూడా ఉంటాయట. అందుకే.. దీని నాణ్యత నిర్ధారణ కోసం టెస్టులు చేస్తున్నారు. రెడ్ మెర్క్యూరీ పక్కన వెల్లుల్లిని ఉంచితే.. అది దూరంగా కదులుతుంది.



అలాగే.. బంగారాన్ని పక్కన ఉంచితే.. అయస్కాంతంలా ఆకర్షించాలట. అద్దం ముందు రెడ్ మెర్క్యూరీ పెడితే.. దాని ప్రతిబింబం తెల్లగా కనిపించాలట. ఈ టెస్టులన్నీ పాసైతేనే.. అది నిజమైన రెడ్ మెర్క్యూరీ అని చెబుతున్నారు.
కొందరు ఎర్రటి ద్రవాన్ని గాజు గొట్టాల్లో నింపి.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెడ్ మెర్క్యూరీ పేరిట జరుగుతున్నదంతా మోసమని.. ప్రజలు వీటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



గతంలో రైస్ పుల్లింగ్, గజ ముత్యం, నాగమణి, డబుల్ ఇంజిన్ లాంటి పేర్లతో రకరకాల మోసాలు జరిగాయ్. ఇది కూడా ఆ తరహా మోసమేనని చెబుతున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని.. పోలీసులు హెచ్చరిస్తున్నారు.