బ్లాక్ ఫిల్మ్ చాటున అసాంఘిక కార్యకలాపాలు

  • Published By: murthy ,Published On : June 19, 2020 / 01:39 PM IST
బ్లాక్ ఫిల్మ్ చాటున అసాంఘిక కార్యకలాపాలు

వాహనాలకు అతికించే బ్లాక్ ఫిల్మ్ చాటున నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని వాహనాల తనిఖీల్లో వెనుకబడింది.  దీంతో జిల్లాలో సాధారణ కార్ల నుంచి ఖరీదైన కార్లలో పలువురు నేరాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మద్యం అక్రమ రవాణా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, వ్యభిచారం, కిడ్నాప్‌లు, దొంగతనాలు, సెటిల్మెంట్లు, అవినీతి తదితర నేరాలకు బ్లాక్‌ఫిల్మ్‌ వేసిన కార్లు కీలకంగా మారాయి. 

జిల్లా వ్యాప్తంగా 1,26,095 కార్లున్నాయి. వీటిలో 1.19 లక్షల సొంత కార్లు ఉండగా, 7,095 మోటార్‌ క్యాబ్‌లున్నాయి.  రవాణా శాఖ రూపొందించిన  నిబంధనలతోపాటు….సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటంలో జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. వినియోగదారులు వివిధ కంపెనీలకు చెందిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కారు తయారీలోనే ప్రింటింగ్‌ గ్లాస్‌కు 30శాతం ఉన్న ఫిల్మ్‌ను ఆయా కంపెనీల యాజమాన్యాలు బిగిస్తున్నాయి. ఆ తర్వాత కారు సైడ్‌ డోర్, వెనుక భాగంలో ఉన్న గ్లాసులకు ఎలాంటి ఫిల్మ్‌లు బిగించకూడదు.

దేశంలో అల్లర్లు, కిడ్నాప్‌లు, హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ చట్టాన్ని అమలు చేయాలని 2012లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం,  కారుకు ఎలాంటి ఫిల్మ్‌ బిగించకూడదు. ముప్పు ఉన్న వారు, వీఐపీలు తగిన కారణాలు చూపించి  పోలీసుల అనుమతితో బ్లాక్‌ఫిల్మ్‌ను ఉపయోగించుకోచ్చని సూచించింది.  కానీ ఇటీవలి కాలంలో అధికారుల అలసత్వం వలన కార్లకు యథేచ్ఛగా బ్లాక్‌ ఫిల్మ్‌ను వినియోగిస్తున్నారు.

దీంతో జిల్లాలో ఎర్రచందనం, మద్యం అక్రమరవాణా, స్మగ్లింగ్, దొంగతనాలు, కిడ్నాప్‌లు, గంజాయి, వ్యభిచారం, సెటిల్‌మెంట్లు జోరుగా జరుగుతున్నాయి.గతంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌పైకొద్దిరోజులు హడావుడి చేసిన పోలీసు, రవాణా అధికారులు ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. బ్లాక్‌ఫిల్మ్‌ వినియోగంపై  ఇటీవల ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు.

ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రోజూ వందలాది వాహనాలు వస్తుంటాయి. జిల్లాలో మెజార్టీ కార్లు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌లు తగిలించి యథేచ్ఛగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌తో తిరుగుతున్న కార్లపై తనిఖీలు నిర్వహించి వాటిని తొలగించి కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.