రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు

  • Published By: vamsi ,Published On : May 21, 2020 / 05:25 AM IST
రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ ‌కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పటికీ, రేపటి(21 మే 2020) నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.

రేపటి నుంచి మే 24వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వచ్చే 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డి) స్పష్టం చేసింది. 

గుంటూరు జిల్లా రెంట చింతలలో మూడు రోజులుగా తన ప్రభావం చూపిస్తున్నాడు సూర్యుడు.. ఈ ప్రాంతంలో ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా చెప్పారు.

రాబోయే రెండు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. 

IMD ప్రకారం, తుని, బాపట్ల, కావలి, కాకినాడ, మాచిలిపట్నం, నర్సాపూర్ మరియు జంగమహేశ్వరపురం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5- 6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అదేవిధంగా, నెల్లూరు, కడప, అనంతపురం, ఒంగోల్, విజయవాడ, కర్నూలు మరియు తిరుపతిలలో మిడిల్ హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తాయి. 

Read: Amphan Toofan : ఏపీకి తప్పిన గండం