Pydithalli Sirimanotsavam : పైడితల్లి సిరిమానోత్సవం అంటే ఏమిటి? విశిష్టత ఏంటి? ఎలా మొదలైంది?

విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా చెబుతారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి..

10TV Telugu News

Pydithalli Sirimanotsavam : దసరా వచ్చిందంటే విజయనగరం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు దసరా నుండి మొదలవుతాయి. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకి సిరిమానోత్సవం అంటే ఏంటి? బొబ్బిలి యుద్ధానికి సిరిమానోత్సవానికి ఉన్న సంబంధమేంటి? సిరిమానోత్సవం ఎలా మొదలైంది?

264 ఏళ్ల క్రితం విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా చెబుతారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయినట్టుగా ప్రచారం. ఆ విగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు చేశారు గ్రామస్తులు. దీనిని నేడు వనం గుడిగా నిత్యం పూజలు చేస్తుంటారు భక్తులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారు.

అప్పలనాయుడు వారుసులే అమ్మవారి పూజారులు…
పైడితల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన పతివాడ అప్పలనాయుడు తొలి పూజారిగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అప్పటినుండి ఇప్పటివరకు అప్పలనాయుడు వారుసులే అమ్మవారి పూజారులుగా కొనసాగుతున్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలు వనంగుడి దగ్గర నిర్వహించే వారు. 1924లో మూడు లాంతర్ల జంక్షన్ సమీపంలో మరోసారి అమ్మవారిని ప్రతిష్టించి చదురుగుడిని నిర్మించారు. వనం గుడిని అమ్మవారి పుట్టినింటిగా, ఊరి మధ్యలో నిర్మించిన చదురుగుడిని మెట్టినింటిగా భావిస్తుంటారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరుపక్కలా ఘటాలు ఉండటం విశేషం. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదలులో అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటూ ఉంటారు. చదురు గుడి దగ్గరే పైడితల్లి ఉత్సవాలు జరుగుతాయి.

Black Grapes : బరువును తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచే నల్ల ద్రాక్ష

యుద్ధానికి దారితీసిన నీటి వివాదం..
1757 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు. ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలి యుద్ధం.

సిరిమానోత్సవానికి దారి తీసిన పరిస్థితులు..
పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ మరణమే సిరిమానోత్సవానికి నాంది పలికిందని పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకులు చెబుతారు. “పైడిమాంబ చిన్నతనం నుంచి అమ్మవారి భక్తురాలు. యుద్ధం ఇరు వంశాలకు మంచిది కాదని అపాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన అన్న పెద విజయరామరాజును హతమార్చేందుకు జరుగుతున్న కుట్రను తెలియచేసేందుకు బయలుదేరిన పైడిమాంబకు తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయరామరాజు మరణించారనే వార్త తెలుస్తుంది”.

“యుద్ధం ఆపేందుకు తాను చేసిన ప్రయత్నాలు వృధా కావడం, ఆ యుద్ధంలోనే తన సోదరుడు మరణించడం ఆమె తట్టుకోలేకపోతుంది. తన మరణంతోనైనా యుద్దానికి ముగింపు పలికి సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ…తాను విగ్రహంగా మారి…దేవిలో ఐక్యమైపోతున్నానని చెప్పి ఆమె పెద్దచెరువులో దూకి మరణిస్తుంది. ఇదే సిరిమానోత్సవం జరగడానికి కారణమైన తొలి సంఘటన” అని పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకులు చెప్పారు.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు ఉత్సవం…
కొందరు జాలర్ల సాయంతో పైడిమాంబను చెరువు నుంచి వెలికి తీసేందుకు అప్పట్లో పైడిమాంబ అనుచరుడిగా ఉన్న పతివాడ అప్పలనాయుడు ప్రయత్నం చేశారు. పెద్ద చెరువులో పైడిమాంబ విగ్రహారూపంలో కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి దగ్గర్లో ఉన్న తోటలో ఒక గుడికట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీన్నే ప్రస్తుతం వనంగుడి అని పిలుస్తున్నారు. ప్రజలను కరువు, వ్యాధుల నుంచి కాపాడేందుకు విగ్రహ రూపంలో తాను దొరికిన రోజు నాడే తనకు ప్రతి ఏటా, దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు ఉత్సవం నిర్వహించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు స్థానికులు చెబుతారు.

“వనంగుడి అడవిలో ఉండటంతో భక్తులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, తనకు మరో చోట గట్టు పై గుడి కట్టాలని అమ్మవారు రాజవంశీకుల కలలో కనపడి చెప్పారని చెబుతారు. దాంతో ప్రస్తుతం ఉన్న మూడు లాంతర్ల సెంటర్ దగ్గర మరో ఆలయం కట్టారు. దీనినే చదురుగుడి అంటారు” అని స్థానికులు తెలిపారు. “అమ్మవారు వెలిసిన వనం గుడి నుంచి ఆశ్వయుజమాసంలో చదురుగుడికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆరు నెలలున్న తర్వాత చైత్రమాసంలో ఇక్కడికి తీసుకొస్తారు. అంటే వనంగుడిలో ఆరు నెలలు, చదురుగుడిలో ఆరు నెలలు ఉంటారని భక్తుల నమ్మకం” అని ప్రశాంత్ చెప్పారు.

చింతమాను… సిరిమానుగా ఎలా మారుతుంది
సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు అమ్మవారు తమ కలలో కనిపించి సిరిమాను చెట్టు ఎక్కడుందో తెలియచేస్తారని సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు చెప్పారు. ఈయన సిరిమానోత్సవానికి ఏడోతరం పూజారి. పైడిమాంబ విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా ఉన్నారు.

Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

“చింతచెట్టు మానునే సిరిమానుగా ఉపయోగిస్తాం. ఈ ఏడాది డెంకాడ పంచాయతీ చందకపేట గ్రామంలోని చందకవారి కల్లాలు దగ్గర చింతమాను చెట్టు ఉందని అమ్మవారు చెప్పడంతో అక్కడికెళ్లి ఆ చెట్లు యాజమానిని అడిగి తీసుకున్నాం. అక్కడ నుంచి పట్టుకొచ్చిన చింతమానును హుకుంపేటలో ఉన్న వడ్రంగులు సిరిమానుగా మారుస్తారు. ఈ సమయంలోనే భక్తులు హుకుంపేటలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించడం, చింతమానును సిరిమానుగా మార్చడంలో నీళ్లు, పసుపు చల్లుతూ సాయం చేస్తారు” అని వెంకటరావు తెలిపారు.

హిందూ ఆలయాల్లో ధ్వజ స్థంభానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటిని చెట్లమానుల నుంచే తయారు చేస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికి ఉన్న రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజ స్థంభాలుండవు. దీంతో పైడితల్లి అమ్మవారు ధ్వజస్థంభాన్నే సిరిమాను రూపంలో ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తారు. దానిపై కూర్చున్న పూజరిని అవహించి ఆమె ప్రజలకు, రాజ కుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తారు.

ప్రధాన ఆకర్షణ రథాలే..
సిరిమానోత్సవంలో ప్రధాన ఆకర్షణ అందమైన రథాలే. సిరిమానుతో పాటే ఈ రథాలను కూడా తయారు చేయడం లేదా మరమ్మత్తులు, రంగులు వేయడం చేసే పని మొదలవుతుంది. ఇదంతా సిరిమాను పూజరి ఇంటి దగ్గరే జరుగుతుంది. ఇక్కడ తయారయ్యే రథాలు, వాటికి వేసే రంగుల వెనుక ఆసక్తికర విషయాలున్నాయి. సిరిమానోత్సవం అంటే రైతుల పండుగ. అలాగే చిన్నపెద్ద అని తేడా లేకుండా అంతా సమానమే చెప్పే ఉత్సవమే ఇది. అందుకు నిదర్శనం సిరిమానోత్సవంలోని రథాలే అని అంటారు రథాలను తయారు చేసే శ్రీనివాస్. ఈ రథాల తయారీలో వాడే రంగులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ తయారయ్యే రథాలకు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుని వాడతారు. శుభానికి సూచికంగా చెప్పుకునే పసుపు, మహిళల బొట్టుకు గుర్తుగా ఎరుపు రంగు, రైతుల పండుగకు గుర్తుగా ఆకుపచ్చ రంగుని వాడతారు.

రైతులు పాడిపంటలు బాగా ఉండాలని కోరుకుంటూ భూమి పూజ చేస్తుంటారు. సాధారణంగా ఉగాది సమయంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు నాగళ్లతో తొలేళ్ల ఉత్సవాన్ని చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పైడితల్లి అమ్మవారి పండుగనే తొలేళ్ల ఉత్సవంగా జరుపుకుంటారు. సిరిమాను సంబరానికి ముందు రోజు తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరుగుతుంది.

సిరిమానును ముక్కలు చేసి…
ప్రధాన ఉత్సవం రోజున సుమారు 60 అడుగుల పొడవుండే సిరిమాను చివరన పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను పైకి లేస్తుంది. ఈ సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది. రాజకుటుంబీకులు, ప్రముఖులు కోట బురుజు దగ్గర కూర్చుని అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి రూపంగా భావించే సిరిమానును అధిరోహించిన పూజారి అందరికీ దీవెనలు అందిస్తారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్ ఘడ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. దానిని రైతులు తీసుకుని వాటిని ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతారు. అలా చేస్తే మంచి పంటలు పండుతాయని నమ్మకం. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం, ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఆ ఏడాది అమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగుస్తాయి.

సాధారణ పరిస్థితుల్లో ఏటా సిరిమానోత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారు. అయితే గతేడాది, ఈ ఏడాది కూడా కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భక్తులకు అనుమతి ఇవ్వలేదు.