Shravana Putrada Ekadashi 2022 : రేపు పుత్రదా ఏకాదశి

శ్రావణ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు.

Shravana Putrada Ekadashi 2022 : రేపు పుత్రదా ఏకాదశి

putrada ekadasi

Shravana Putrada Ekadashi 2022 :  శ్రావణ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిని విష్ణు సహస్రానామలతో పూజించినట్లైతే తప్పక సంతానం కలుగుతుంది. అందుకే దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు.

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకి వివరించిన పురాణ గాథ…
పూర్వము మహిజిత్ అనే రాజు ఉండేవాడు. అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు.  కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను, పండితులను సంప్రదించినా తన సమస్యకు పరిష్కారం దొరకలేదు.  చివరిగా లోమశుడనే మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని  తన  బాధను వివరిస్తాడు. అప్పుడు లోమశ మహర్షి రాజు గారి కష్టములను విని అతనికి పుత్రులు కలగకపోవటానికి గల కారణం వివరించాడు. అనంతరం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తి శ్రద్దలతో పూజిస్తే  తప్పకుండా  మీకు సంతానం కలుగుతుంది అని ఉపాయం చెప్పాడు.

మహిజిత్ రాజు భక్తి శ్రద్దలతో భార్యా సమేతంగా ఏకాదశి ఉపవాసం ఉండి.. నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు. ఆ తరువాత రాజుకి గారి మంచి సంతానం కలుగుతుంది. దానికి రాజు చాలా సంతోషించి బ్రాహ్మణులకు, రాజ్యంలో ఉన్న ప్రజలకు దాన ధర్మాలు విరివిగా చేసాడట. శ్రావణ మాసం లో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపాలు అన్ని హరిస్తాయని, మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి.

పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి.

ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా  ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు.

ఈ ఏడాది పుత్రదా ఏకాదశి  ఆగస్టు7 వ తేదీ , ఆదివారం రాత్రి 11:50 గంటలకు ప్రారంభమై…. 8 వతేదీ  సోమవారం రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 8న జరుపుకోనున్నారు. ఈ  ఏడాది   శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతున్నారు.

సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందని పండితులు సెలవిస్తున్నారు.