Andhra Pradesh: విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన .. రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్..

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం 75,789 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు సమకూరింది.

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన .. రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్..

AP importent News

Andhra Pradesh: ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‍కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని మరికొన్ని ముఖ్యమైన వార్తల వివరాలు..

తిరుమల సమాచారం..

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం 75,789 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు సమకూరింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.

ఇచ్చాపురంలో కూలిన వంతెన ..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో పాత వంతెన కూలింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాత వంతెనపై భారీ వాహనం రావడంతో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది.

విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన ..

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.4,592 కోట్లతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. రూ.194.40 కోట్లతో తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులు, రూ. 23.73 కోట్లతో నిర్మించనున్న చింతపల్లి ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. భోగాపురం మండలం సవరవిల్లి వద్ద బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.

రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్ ..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ వేడుకలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని అన్నారు. ఆయన విజన్ కలిగిన నేత అని కొనియాడారు. దీంతో వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్‌కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఫోన్‌లో రజనీకాంత్‌కు తెలిపారు. స్పందించిన రజనీకాంత్.. ఎవరెన్ని విమర్శలు చేసినా నావాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, నా అభిప్రాయం మారదని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తన అభిమాన సంఘాలని సంయమనం పాటించమని విజ్ఞప్తి చేశానని రజనీకాంత్ చంద్రబాబుతో చెప్పారు.

కార్మిక సంఘాల రాస్తారోకో ..

విశాఖపట్టణం ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ నేడు కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో విజయవాడలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ..

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ బస్ డ్రైవర్ నిద్రమత్తులో లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ సిట్‌‌పై నేడు సుప్రీంలో తీర్పు..

గత ప్రభుత్వం హయాంలో నిర్ణయాలపై దర్యాప్తుకోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సిట్‌‌పై ‘స్టే’ ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు ముగించి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బుధవారం ఉదయం గం. 10.30కు జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.