పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందినట్లేనా..

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందినట్లేనా..

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను మండలి పక్కన పెట్టేసింది. దీనిపై సెలెక్ట్‌ కమిటీని వేయడంతో కాలం ముగిసింది. మరోసారి ఈ బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించింది ప్రభుత్వం. గవర్నర్‌ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ మొదలవడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

ఈ బిల్లులపై గవర్నర్‌.. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన నిపుణులతో ఈ బిల్లులపై చర్చిస్తున్నారని చెబుతున్నారు. శాసనమండలిలో సెలక్టు కమిటీకి అప్పగించారని, ఆ అంశం తేలకుండానే వాటిని ఆమోదానికి పంపారని, అంతేకాక బిల్లులు రాష్ట్ర విభజన చట్టంతో ముడిపడి ఉన్నందున వాటిని ఆమోదించవద్దంటూ ప్రతిపక్ష నేతలు గవర్నర్‌కు లేఖలు రాశారు. ఇంకోవైపు సెలక్ట్‌ కమిటీ ఏర్పాటుపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలోనే బిల్లులపై నిర్ణయం తీసుకునే ముందు న్యాయ నిపుణులను గవర్నర్‌ సంప్రదిస్తున్నట్లు సమాచారం.

రాజ్యాంగ నిపుణులతోనూ ఆయన మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు, తర్వాత అక్కడ జరిగిన పరిణామాలపై అసెంబ్లీ అధికారులను ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ రెండు బిల్లులను తొలిసారి శాసనసభలో ఆమోదించి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ వీటిని సెలక్టు కమిటీకి అప్పగిస్తూ మండలి చైర్మన్‌ తన నిర్ణయాన్ని సభలో ప్రకటించారు. తర్వాత సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడం, బిల్లులను కమిటీకి పంపకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈ రెండు బిల్లులను మళ్లీ శాసనసభలో ఆమోదించి మండలికి పంపింది. అప్పుడు కూడా మండలిలో వీటిపై చర్చ జరగలేదు. శాసనసభ రెండోసారి ఆమోదించిన పంపిన బిల్లులు కాబట్టి, మండలికి పంపిన నెలరోజుల తర్వాత సహజంగా అవి ఆమోదం పొందినట్లే అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. జులై 17తో గడువు ముగిసిందంటూ 18న రెండు బిల్లులనూ ఆమోదం కోసం గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. తర్వాత ఈ రెండు బిల్లులను ప్రోసెస్‌ చేయాలని గవర్నర్‌ కార్యాలయం రాష్ట్ర న్యాయశాఖకు పంపింది.

న్యాయశాఖ పరిశీలన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తర్వాత ముఖ్యమంత్రికి వెళ్లిన ఈ బిల్లుల దస్త్రాలను అక్కడి నుంచి తిరిగి గవర్నర్‌కు పంపారు. ఇప్పుడు గవర్నర్‌ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గవర్నర్‌ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ప్రతిపక్షాల వాదనలకు అనుకూలంగా స్పందిస్తారో? ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారో అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.