Self Lockdown AP : ఏపీలో సెల్ఫ్ లాక్ డౌన్

ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల తీవ్రం కావడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు

Self Lockdown AP : ఏపీలో సెల్ఫ్ లాక్ డౌన్

Self Lockdown Ap

Self lock down in AP : ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా కేసుల పెరుగుదల తీవ్రం కావడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, కడప, విజయనగరం, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొవిడ్‌ ఆంక్షలతోపాటు వివిధ ప్రాంతాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎక్కడా దుకాణాలు తెరుచుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరచి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఒంటి గంటకే మూసివేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కోవూరులతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎవరికి వారు ఆంక్షలు విధించుకుంటున్నారు. గూడూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు కొనసాగించేందుకు వ్యాపారస్తులు స్వయంగా ఆంక్షలు పెట్టుకున్నారు. గూడూరులోని బంగారం వర్తకులు మాత్రమే మధ్యాహ్నం ఒంటిగంట వరకే షాపులు ఓపెన్‌ చేసేలా స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు. ఈ ఆంక్షలు మే 15 వరకు కొనసాగనున్నాయి. సూళ్లూరు పేటలో మే 5 వరకూ స్వచ్ఛంద ఆంక్షలు ఉంటాయి.

విజయనగరం జిల్లాలో కొవిడ్‌ స్వచ్ఛంద ఆంక్షలు విధించుకుంటున్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపు మేరకు విజయనగరం కార్పొరేషన్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత షాపులు మూసివేస్తున్నారు. బొబ్బిలిలో ఈ నెల 26 నుంచి స్వచ్ఛందంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు నిత్యావసరాల అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నారు. పార్వతీపురంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలను మూసివేస్తున్నారు.

కడప జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ ప్రకటించారు జిల్లా కలెక్టర్‌. రాయచోటి నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుచటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అనంతపురం జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. సాయంత్రం ఆరు గంటలకే షాపులను మూసివేస్తామని వర్తక సంఘాలు అనంతపురం నగర కమిషనర్‌కు తెలిపాయి. కొందరు 6 గంటల తర్వాత కూడా షాపులు ఓపెన్‌ చేసి ఉంచడంతో పోలీసులు బలవంతంగా మూయిస్తున్నారు. దుకాణాలు మూసివేసినా.. జనం మాత్రం రాత్రి 10 గంటల వరకూ రోడ్లపై తిరుగుతున్నారు. హోటళ్లలో పార్శిల్‌ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. హిందూపురంలో బైక్‌పై ఒక్కరికే అవకాశం. అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఫైన్‌ విధిస్తున్నారు పోలీసులు. రెండోసారి అలా దొరికితే బైక్‌ సీజ్‌ చేస్తామంటున్నారు.

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకున్నారు. అరకు, దేవరాపల్లిలో మినీ లాక్‌డౌన్‌ పెట్టుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారు. శ్రీకాకుళం జిలాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు జిల్లా కలెక్టర్‌. మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంది. ప్రజలు బయటకు రాకుండా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. పలాస, రాజాం, పాలకొండ, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు వ్యాపారులు.

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొవిడ్‌ ఆంక్షలతో పాటు పలుచోట్ల స్వయంగా తీసుకున్న నిర్ణయాలు అమలవుతున్నాయి. ఒంగోలు, చీరాల, అద్దంకి, పొదిలి, కనిగిరిలో మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. దర్శి, పర్చూరులో మధ్యాహ్నం 12 తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారు. కొండపి, కందుకూరులో మధ్యాహ్నం ఒంటి వరకూ దుకాణాలు తెరచి ఉంచుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధించారు జిల్లా కలెక్టర్‌. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు నిర్వహిస్తున్నారు. మే నెలలో జరగాల్సిన గ్రామ జాతరలను నిలిపివేశారు. దేవాలయాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంది. రంజాన్‌ మాసం సందర్భంగా మసీదుల్లోకి 18 నుంచి 45 ఏళ్లున్నవారినే అనుమతిస్తున్నారు. చర్చీల్లో ప్రార్థనలు నిలిపివేశారు. రాత్రి కర్ఫ్యూ జిల్లా అంతటా కొనసాగుతోంది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు పక్కా చర్యలు తీసుకుంటోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు జనం, వ్యాపార సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. కొవిడ్‌ వైద్యం చేసే ఆస్పత్రుల సంఖ్యను పెంచేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లాలో మరో 26 ఆస్పత్రుల్లో కొవిడ్‌ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 56 ఆస్పత్రుల్లో మూడు వేల 610 పడకలను సిద్ధం చేశారు. ఈరోజు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరుచుకుని ఉంటాయి. ఆ తర్వాత అత్యవసరం సేవలు మినహా మిగిలినవన్నీ నిలిపేస్తారు.