అమ్మ ఒడి లాంటి పథకాలతో… దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్థికవేత్తలు

  • Published By: venkaiahnaidu ,Published On : January 24, 2020 / 07:30 AM IST
అమ్మ ఒడి లాంటి పథకాలతో… దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్థికవేత్తలు

ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను ఉత్తేజపరిచే చిట్కా గురించి అనేక మంది ఆర్థిక వ్యాఖ్యాతలు, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మరియు నోబెల్ గ్రహీతలు ఇప్పుడు ఏకాభిప్రాయంలో ఉన్నారు. నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో ఇటీవల ‘TUP’ పాలసీ(నిరు పేదలను లక్ష్యంగా చేసుకుని నగదు ఇవ్వడం ద్వారా వారు వెంటనే ఖర్చు చేసే విధానం)కి పిలుపునిచ్చారు.

బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…వినియోగాన్ని ఉత్తేజపరిచేందుకు సమాజంలోని పేద వర్గాలకు నేరుగా నగదు బదిలీ కోసం ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. మరో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ….పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, ద్రవ్య లోటు ఆందోళనలు ఉద్దీపన ప్యాకేజీ ద్వారా డిమాండ్ పెంచడానికి అడ్డంకి కాదని అన్నారు. అయితే దేశానికి ఎకనామిక్ పాలసీ ప్రిస్క్రిప్షన్ లో ఇంతకుముందెప్పుడూ అన్ని వర్గాల వ్యాఖ్యాతల నుంచి  ఇంతటి ఏకాభిప్రాయం లేదు. 

అయితే పథకాల రూపంలో దేశంలోని పేద ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేయడం ద్వారా డిమాండ్ కు,ప్రేవేటు పెట్టుబడులను ఉత్తేజపరుస్తుందనే ఐడియాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఐడియాను న్యాయ్ అనే పేరుతో నిరుపేదలకు నెలకు రూ.6,000అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఐడియాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమయింది. ఈ మెసేజ్ ను ప్రజలు కూడా నమ్మలేదు,పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కుంగిపోయే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఇదే ఐడియా(పేదలకు నగదు బదిలీ ద్వారా డిమాండ్ ఉత్తేజపరచడం)కరెక్ట్ అన్న ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది. నేరుగా పేదలకు అకౌంట్లలోకి నగదు సరఫరా చేయడం ద్వారా మార్కెట్లు పుంజుకుంటాయని ఆర్థిక వ్యాఖ్యతలు అంటున్నారు.

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఈ ఐడియాతో ముడిపడి ఉన్నదే. మార్కెట్ కు ఊపు రావాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలన్న ఐడియాను ఏపీ ప్రభుత్వం ఫాలో అయింది. అమ్మఒడి అంటూ జగన్ ప్రభుత్వం దాదాపు 80శాతం మంది తల్లులకు 15వేలు వంతున డబ్బులు వేసేసింది. సరిగ్గా సంక్రాంతికి ముందు వచ్చి పడ్డాయి ఈ డబ్బులు. దీంతో ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో మార్కెట్ కు ఫుల్ ఊపు వచ్చింది. బట్టల దుకాణాలు, ఇంటి సామగ్రి దుకాణాలు, ఫర్నిచర్ దుకాణాలు, సినిమా హాళ్లు, ఆఖరికి బంగారం దుకాణాలు కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా పండగ దాటాక కూడా బిజినెస్ లు బాగున్నాయని ఓ దుస్తుల దుకాణం యజమాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం మీద ఖర్చు చేసింది టోటల్ గా చూసుకంటే వేల కోట్లు. అన్ని డబ్బులు మార్కెట్ లోకి రావడం అంటే దానికి ఎంత ఊపు వస్తుందో అర్థం అవుతుంది.