ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది ? 17 మంది ఉద్యోగుల సస్పెన్షన్, దేవాదాయ శాఖ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది ? 17 మంది ఉద్యోగుల సస్పెన్షన్, దేవాదాయ శాఖ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

Indrakeeladri Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది…? తరచూ వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి….? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏసీబీ నివేదిక ఆధారంగా ఒకేసారి 17 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. సస్పెన్షన్ ఆర్డర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు చేసిన సంచలన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీవరకు ఏసీబీ అధికారులు దుర్గగుడిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా 17 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు. దర్శనం టిక్కెట్ కౌంటర్లు, శారీస్ గోడౌన్ కౌంటర్లు, అన్నదానం స్టోర్, ప్రసాదం కౌంటర్, మెయిన్ ప్రొవిజన్ స్టోర్, టెండర్ల లో అవకతవకలు,‌శానిటేషన్, కీలకమైన విభాగాలకు సంబంధించి ఫైళ్లను రిజిస్టర్ లేకపోవడం, ఇతర విభాగాల్లో అక్రమాలపై చర్యలు తీసుకున్నామని అర్జునరావు చెప్పారు.

acb

కేరాఫ్ అడ్రస్ : –
ఇప్పుడే కాదు..కొన్నాళ్లగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఇంద్రకీలాద్రి. పాలకమండలి సభ్యులు, అధికారులు కలిసి దుర్గగుడి ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆజాద్, సూర్యకుమారి ఈవోగా పనిచేసిన సమయంలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుకాణాలను కొండ దిగువకు మార్చడం, గోశాల భూమి వివాదం, అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు కరిగించి చెల్లింపులు చేయడం వంటివి వెలుగుచూశాయి. క్షుద్రపూజల కలకలం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ammavaru

వరుస వివాదాలు : –
పద్మ, కోటేశ్వరమ్మ ఈవోలుగా ఉన్న సమయంలోనూ వరుసగా వివాదాలు జరిగాయి. అమ్మవారి చీర కనిపించకుండా పోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో రెండేళ్లలో నలుగురు ఈవోల బదిలీ జరిగింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈవోగా సురేశ్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం చెల్లదంటూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. ఆయనకు ఆర్జేడీగా పదోన్నతి కల్పించారు. ఇంజనీరింగ్ పనులు, టెండర్ల ప్రక్రియ, శానిటేషన్, సెక్యూరిటీ టెండర్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

Temple

రాజకీయ ప్రకంపనలు : –
వెండిరథం మూడు సింహాల మాయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీలతో ఇంద్రకీలాద్రిపై వివాదాలు మరింత ముదిరాయి. సస్పెన్షన్ ఆర్డర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటీ టెండర్ల విషయంలో ఈవో సురేశ్ బాబు తన ఆదేశాలు పక్కన పెట్టారని అర్జునరావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవో… మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ నిర్వహణా బాధ్యత అప్పగించారని మండిపడ్డారు. మూడు సింహాల చోరీకి మ్యాక్స్ సంస్థ తప్పిదమే కారణమైనప్పటికీ….ఈ సంస్థకే కాంట్రాక్టు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.