Innovative idea : యువ పశువైద్యుడి వినూత్న ఆలోచన…ఇంటి పెరట్లో కోళ్ళ పెంపకానికి పంజరం..నెలకు 10వేల అదాయం

గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఆదాయం పొందే మార్గాలను యువ పశువైద్యుడు డా.ఆవుల సాయి మహేష్‌రెడ్డి సూచిస్తున్నారు. యువతకే కాదు వృద్ధులకూ ఉపయోగపడేలా సులభమైన రీతిలో చేయగలిగే మంచి ఉపాయం ఆలోచించారు.

Innovative idea : యువ పశువైద్యుడి వినూత్న ఆలోచన…ఇంటి పెరట్లో కోళ్ళ పెంపకానికి పంజరం..నెలకు 10వేల అదాయం

Innovative Idea

Innovative idea of a young veterinarian : గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఆదాయం పొందే మార్గాలను యువ పశువైద్యుడు డా.ఆవుల సాయి మహేష్‌రెడ్డి సూచిస్తున్నారు. యువతకే కాదు వృద్ధులకూ ఉపయోగపడేలా సులభమైన రీతిలో చేయగలిగే మంచి ఉపాయం ఆలోచించారు. పెరట్లోనే గుడ్లు పెట్టే కోళ్ల పెంపకానికి ఉపయోగపడే చిన్నపాటి పంజరాన్ని రూపొందించారు. గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామానికి చెందిన ఆవుల సాయి మహేష్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. కృష్టా జిల్లా గన్నవరం కాలేజీలో పశువైద్యంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 2017లో ఈపూరు మండలం ముపాళ్లలో పశువైద్యునిగా ఉద్యోగంలో చేరారు.

గేదెలను పోషిస్తూ పొట్ట పోసుకునే రైతు కుటుంబాలు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో గేదెలను అమ్మివేసి పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు వలస పోతున్న సందర్భాలలో ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపితే మేలు జరుగుతుందని భావించిన మహేష్‌రెడ్డి గుడ్లు పెట్టే 120 కోళ్లను పెరట్లో సునాయాసంగా పెంచుకోవడానికి వీలయ్యే ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’ను రూపొందించారు. మొదటిగా తమ పెరట్లోనే ఏర్పాటు చేశారు. వయోవృద్ధుడైన తన తండ్రే దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ముప్పాళ్ల మండలంలోనే కాదు అనేక జిల్లాల్లో ఇప్పటికే 80 మంది వరకూ ఈ కేజ్‌ని ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు.

కొద్దిపాటి స్థలంలో పెట్టుకోదగిన విధంగా తాను గుడ్లు పెట్టే కోళ్లను పెంచుకునే మూడు అంతస్థుల పంజరానికి మహేష్‌రెడ్డి రూపకల్పన చేశారు. దీని పొడవు 7.5 అడుగులు, వెడల్పు 7 అడుగులు, ఎత్తు 7 అడుగులు ఉంటుంది. ఒక వైపు 3 కానాలు, రెండో వైపు మరో 3 కానాలను కోళ్ల కోసం ఏర్పాటు చేశారు. దీనికిపైన 20 లీటర్ల ఫైబర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. రోజూ దీన్ని నింపితే చాలు. ఆ నీరు కోళ్లకు అందుబాటులోకి వస్తాయి. కోళ్ళకు తగినంత ధాణాను సమయానుగుణంగా వేయాలి.

చిన్నపాటిస్ధలంలో కోళ్ల ఫారాన్ని నిర్వహించడం పెద్ద కష్టం ఏమీ ఉండదు. గుడ్లను ఇంటి దగ్గరే స్వయంగా అమ్ముకోవచ్చు. ఇటువంటి పంజరాలు ఒక్కరే నాలుగైదు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్నపాటి యూనిట్లు స్థాపించే యువకులు, రైతులకు ప్రభుత్వం నుండి ప్రోత్సహం లభిస్తుందని డాక్టర్‌ మహేష్‌రెడ్డి తెలిపారు. తన దగ్గరకు వచ్చిన యువతకు ఇలాంటి పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంతోపాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో 80 వరకు యూనిట్లు ఇప్పటికే విజవంతంగా నడుస్తుండటం విశేషం.

గుడ్లు పెట్టే వయసున్న 120 కోళ్లతో పాటు మూడు అంతస్థుల కేజ్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలంటే రూ.45,000 వరకు ఖర్చవుతుంది. ఇనుప (వెల్డు) మెష్‌తో కోళ్ల బుట్టలను అల్లే వారు గ్రామాల్లో అక్కడక్కడా ఉంటారు. వాళ్లయినా ఈ పంజరాన్ని తయారు చేయగలుగుతారు. అలా చేయించుకుంటే రూ.30-35 వేలలోనే పూర్తవుతుంది. రోజుకు కోడికి 80 గ్రాముల దాణా అవసరం. 120 కోళ్ల పెంపకం ద్వారా రోజూ 110 గుడ్ల ఉత్పత్తి ఏడాది వరకు పొందవచ్చు. ఇంటి దగ్గరే గుడ్డు రూ. 5 చొప్పున అమ్ముకోవచ్చు. దాణా ఇతరత్రా ఖర్చులు పోను ఒక్కో పంజరం నుంచి రూ. 10 వేల నికరాదాయం వస్తుంది.