రాజధానిలో వినూత్న నిరసనలు : అరగుండుతో..నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 09:18 AM IST
రాజధానిలో వినూత్న నిరసనలు : అరగుండుతో..నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు

రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కొందరు రైతులు అరగుండుతో నిరసన తెలుపుతుంటే.. మరి కొందరు మొక్కలను ఒంటికి చుట్టుకుని ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రాణాలు పోయినా రాజధాని మార్పును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన..GN RAO కమిటీ నివేదిక ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారానికి ఆరో రోజు చేరుకుంది. 

నవగ్రహాల చుట్టూ తిరిగిన మహిళలు : –
మందడంలో రైతుల పలు రకాలుగా నిరసన తెలిపారు. కొందరు ట్రాక్టర్లను రోడ్లకు అడ్డుగాపెడితే… మరికొందరు రహదారిపైనే పశువులను కట్టేసి నిరసన తెలిపారు. ఇంకొందరు భిక్షాటన చేశారు. రైతు దినోత్సవం రోజునే తాము రోడ్డునపడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని సైతం రహదారిపైనే నిర్వహించారు.రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నిరసన తెలిపారు .. కృష్ణాయపాలెం మహిళలు. ఎన్నికలప్పుడు నవరత్నాలంటూ హామీ ఇచ్చిన సీఎం జగన్‌కు.. నవగ్రహాలు బుద్ధిని ప్రసాదించాలంటూ వేడుకుంటున్నారు.

పోలీసులు సహకరించాలంటున్న మహిళలు : – 
అమరావతిలో రాజధాని కోసం అన్ని జిల్లాల వాళ్లు సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు .. తుళ్లూరు మహిళలు. ఆనాడు ఏ ఒక్క జిల్లా కోసమో భూములు ఇవ్వలేదని.. ఏపీ ప్రజలందరి కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల ప్రజలు, ఉద్యోగులు ఉద్యమానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. పోలీసులు కూడా తమ పోరాటానికి సహకరించాలని వేడుకుంటున్నారు. రాజధానిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో .. ఆందోళన చేపట్టారు.

మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా : – 
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నా చేయడంతో .. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని.. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. రాజధాని నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కాదు.. అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మండిపడ్డారు.
Read More : పోలీసుల ఆంక్షలు : రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ