స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక…కీలక అంశాలు వెల్లడి

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 04:22 PM IST
స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక…కీలక అంశాలు వెల్లడి

అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం. పది మంది ప్రాణాలను రమేష్‌ ఆస్పత్రి బలి తీసుకుంది. విచారణ కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో ఇవే అంశాలను స్పష్టం చేసింది.



రమేష్‌ ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే ప్రమాదం
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందింది. విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విచారణ కమిటీ తన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. రమేష్‌ ఆస్పత్రి నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి, 10మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమని తేల్చింది.

ప్రభుత్వ నియమాలను పట్టించుకోని రమేష్‌ ఆస్పత్రి
రమేష్‌ ఆస్పత్రి ప్రభుత్వ నియమాలను ఏమాత్రం పట్టించుకోలేదని విచారణ కమిటీ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వ నియమాల ఉల్లంఘన అడుగడుగునా జరిగిందని తేల్చింది. అంతేకాదు.. చివరికి వైద్య విలువలను కూడా రమేష్‌ ఆస్పత్రి నీరుగార్చిందని వెల్లడించింది.



కోవిడ్‌ సోకని వారినీ చేర్చుకున్న రమేష్‌ ఆస్పత్రి
కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధలను రమేష్‌ ఆస్పత్రి ఉల్లంఘించినట్టు కమిటీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జారీ చేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి.. కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉన్నవారిని, కోవిడ్‌ సోకనివారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నట్టు విచారణ కమిటీ స్పష్టం చేసింది. కోవిడ్‌ సోకిన వారికి వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రోటోకాల్‌ను కూడా రమేష్‌ ఆస్పత్రి తుంగలో తొక్కిందని తెలిపింది.

భద్రతా ప్రమాణాలు చూసుకోకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు
స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌కు అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? చూసుకోకుండా రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌నుఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, ఎన్‌వోసీ లెటర్‌గానీ, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవని రిపోర్ట్‌లో తెలిపింది. ఎం5, మెట్రోపాలిటిన్‌ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను రమేశ్‌ హాస్పిటల్‌ నిర్వహించినట్టు తెలిపింది.



ఎలాంటి అనుమతి లేకుండానే ప్లాస్మా థెరపీ చికిత్స
ఎలాంటి అనుమతి లేకుండానే ప్లాస్మా థెరపీ చికిత్స అందించిందని రిపోర్ట్‌లో పేర్కొంది. కోవిడ్‌ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ అన్ని కేటగిరీల కరోనా పేషెంట్లకు ఇచ్చినట్టుగా స్పష్టం చేసింది. స్వర్ణప్యాలెస్‌ బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది.

ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు పాతర
అన్ని నియమ, నిబంధలకు రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం.. ఉద్దేశ పూర్వకంగా.. కేవలం ధనార్జనే లక్ష్యంగా తూట్లు పొడిచినట్టు విచారణ కమిటీ తేల్చింది. స్వర్ణ ప్యాలెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే… అగ్రిమెంట్‌ కుదరడానికి ముందుగానే కోవిడ్‌ చికిత్స పేరుతో పేషంట్స్‌ను అక్కడ ఉంచినట్టు కమిటీ తెలిపింది.

బాధ్యులపై చర్యలకు సర్కార్‌ రెడీ
స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక అందడంతో.. ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు రెడీ అవుతోంది. త్వరలోనే ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.