High Court: క‌రోనా వ్యాప్తిపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి, నివార‌ణ చ‌ర్యల‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం(31 ఆగస్ట్ 2021) విచార‌ణ‌ జరిగింది.

High Court: క‌రోనా వ్యాప్తిపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి సూచనలు

Ap High Court

Corona Virus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి, నివార‌ణ చ‌ర్యల‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం(31 ఆగస్ట్ 2021) విచార‌ణ‌ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో కేసులు పెర‌గ‌డంపై ఆరా తీసిన హైకోర్టు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ విధానంపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్టు కోర్టుకు ప్రభుత్వం వెల్లడించగా.. మిగిలిన వారికి వ్యాక్సినేష‌న్ త్వరలో పూర్తి చెయ్యనున్నట్లు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది ప్రభుత్వం.

సెప్టెంబ‌ర్ 8వ తేదీ నాటికి వ్యాక్సినేషన్ స్టేట‌స్ రిపోర్టు దాఖ‌లు చేయాల‌ని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొవిడ్ నియంత్రణ‌కు ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టాలని హైకోర్టు ఆదేశించింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది న‌ర్రా శ్రీ‌నివాస్‌ వాద‌న‌లు వినిపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన 28 ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌లో 18 ప్లాంట్లు ఏర్పాటు పూర్త‌ైనట్లు అఫ‌డ‌విట్ దాఖలు చేసింది ప్రభుత్వం.

ఇదే సమయంలో జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్‌ సమయంలో పాటించాల్సిన ఆంక్షలు, నిబంధనలు వీలైనంత ముందుగానే ప్రజలకు తెలియజేస్తే ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. మూడో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నందున ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచనలు చేసింది.