ప్రాణం తీసిన కులాంతర వివాహం

  • Published By: bheemraj ,Published On : July 10, 2020 / 07:01 PM IST
ప్రాణం తీసిన కులాంతర వివాహం

కడప జిల్లాలో ఓ యువతి ప్రేమ పెళ్లి ఆమె తండ్రి ప్రాణాలు తీసింది. ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన హేమలత అనే యువతి గత నెల 25న కులాంతర వివాహం చేసుకుంది. ఇందుకు హేమలత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. తండ్రి ప్రభాకర్ నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది.

ప్రభాకర్ కూడా కుమార్తే ప్రేమ వివాహంపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ముందు గలాటా సృష్టించాడు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. దీంతో ప్రభాకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు 10 రోజులుగా స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

10 రోజులుగా ప్రభాకర్ ను పీఎస్ కు పిలిపించి పోలీసులు చితకబాదారని కుటుంబీకులు వాపోయారు. పోలీసులు కొట్టారన్న అవమాన భారంతో ఇంటికి వెళ్లిన ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్ ను చితకబాదుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమను కూడా పది మంది పోలీసులు కలిసి కొట్టారంటూ ప్రభాకర్ భార్య, కుమారుడు ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందన్న అవమానంతోనే ప్రభాకర్ ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.