జ్యోతుల వర్సెస్ పర్వత.. రంజుగా ప్రత్తిపాడు రాజకీయాలు.. అధిష్టానాలు చెక్ పెడతాయా? లేక సామాజిక వర్గ పెద్దలు పరిష్కరిస్తారా?

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 05:40 PM IST
జ్యోతుల వర్సెస్ పర్వత.. రంజుగా ప్రత్తిపాడు రాజకీయాలు.. అధిష్టానాలు చెక్ పెడతాయా? లేక సామాజిక వర్గ పెద్దలు పరిష్కరిస్తారా?

interesting politics in prathipadu: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటల యుధ్ధానికి దిగడమే కారణమంటున్నారు. కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆది నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ముద్రగడ, వరుపుల, పర్వత ఇలా ఈ మూడు కుటుంబాల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది.

వరుపుల వర్సస్ పర్వత:
1955 తర్వాత పర్వత కుటుంబం నుంచి పర్వత గుర్రాజు, పర్వత సుబ్బారావు, పర్వత బాపణమ్మ, పర్వత శ్రీసత్యనారాయణ మూర్తి, పర్వత పూర్ణచంద్రప్రసాద్ మొత్తం ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ముద్రగడ కుటుంబం నుంచి ముద్రగడ వీరరాఘవరావు, ముద్రగడ పద్మనాభం కలసి ఆరు సార్లు గెలుపొందారు. ఇక వరుపుల కుటుంబం నుంచి జోగిరాజు, సుబ్బారావు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల కాలంలో ముద్రగడ కుటుంబం పూర్తిగా కాపు ఉద్యమానికి పరిమితం కావడంతో నియోజకవర్గంలో రాజకీయాలు వరుపుల వెర్సస్ పర్వత అన్నట్లు సాగుతున్నాయి.

మెట్ట ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా బంధుత్వాలు:
2019 ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలో టీడీపీ అభ్యర్థి వరుపుల రాజాపై వైసీపీ అభ్యర్ధి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గెలుపొందారు. రాజకీయాల మాట ఎలాగున్నా పర్వత, వరుపుల కుటుంబాల మధ్య పూర్వం నుంచి బంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. అతిథి మర్యాదలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే గోదావరి జిల్లా ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా బంధుత్వాలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది.

టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు ప్రయత్నించిన రాజా:
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే రాజా రాకను స్థానిక ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ అడ్డుకోవడంతో తప్పనిసరి పరిస్థితిలో టీడీపీలో కొనసాగుతున్నారని అంటున్నారు. అంతేకాదు డీసీసీబీ చైర్మన్‌గా రాజా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ శాసనసభలో ప్రస్తావించడంతో పాటు ఆయనపై విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో లంపకలోవ పీఏసీఎస్‌లో నిధుల దుర్వినియోగంపై కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

పెద్దాపురం సొసైటీలో రూ. 16 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ:
పెద్దాపురం కో-ఆపరేటివ్ సొసైటీ అధికారుల ప్రాథమిక విచారణలో సుమారు 16 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తేలింది. దీంతో కోఆపరేటివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రాజా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అయితే రాజా తన అరెస్టుపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అరెస్టు తాత్కాలింగా నిలిచిపోయింది. రాజాకు మద్దత్తుగా ఆ పార్టీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప నిలవడంతో మెట్ట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

రెండు పార్టీల మధ్య వైరం రెండు కుటుంబాల వివాదంగా మారిందా?
పర్వత, వరుపుల ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం, ఇరు కుటుంబాల మధ్య బంధుత్వాలు ఉండటంతో ప్రత్తిపాడు రాజకీయాలు మరింత రంజుగా మారాయి. కానీ ప్రస్తుతం రెండు పార్టీల మధ్య వైరం కాస్త రెండు కుటుంబాల మధ్య వైరంగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. రాజా వర్సెస్ పూర్ణచంద్రప్రసాద్ అంటూ సాగుతోన్న మెట్ట రాజకీయాలు నియోజకవర్గ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయని టాక్‌.

వైరానికి చెక్‌ చెప్పేందుకు రంగంలోకి జ్యోతుల నెహ్రూ:
వారసత్వ రాజకీయాలతో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా, పూర్ణ చంద్ర ప్రసాద్‌ల రాజకీయ వైరానికి చెక్ పెట్టేందుకు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. రాజాకు మద్దతుగా మాట్లాడిన జ్యోతుల నెహ్రూపై పూర్ణచంద్రప్రసాద్ ఒంటి కాలిపై లేవడంతో పార్టీలో ఉన్న ఇరువర్గాల బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీల మాట ఎలాగున్నా బంధుత్వాలను పక్కన పెట్టి సీనియర్ అనే కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారట.

వివాదాలకు అధిష్టానాలు చెక్ పెడతాయా? లేక సామాజిక వర్గ పెద్దలు పరిష్కరిస్తారా?
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో తేల్చుకుందామంటూ ఇరు వర్గాలు విసురుకున్న సవాళ్లు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజా వర్సెస్ పూర్ణచంద్రప్రసాద్ వివాదం కాస్త ఇప్పుడు జ్యోతుల వర్సెస్ పర్వతగా మారడంతో నియోజకవర్గ రాజకీయాలు ఎలాంటి టర్న్‌లు తీసుకుంటాయోనని చర్చిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కేడర్, బంధువులు నలిగిపోతున్నారట. ఈ నేపథ్యంలో మెట్ట రాజకీయ వివాదాలకు అధిష్టానాలు చెక్ పెడతాయా? లేక సామాజిక వర్గ పెద్దలు పరిష్కరిస్తారా? అన్ని వేచి చూడాల్సిందే.