ఏపీ – తెలంగాణ మధ్య రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు!

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 11:57 AM IST
ఏపీ – తెలంగాణ మధ్య రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు!

Interstate Bus Services To Andhra Pradesh & Telangana : 
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది.




ఇటీవలే జరిగిన టెలీ మీటింగ్ లో పలు అంశాలపై ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. చర్చలో వచ్చిన అంశాలపై ఓ ఒప్పందానికి వచ్చారు. రూట్ మ్యాప్, కిలోమీటర్ల సమస్యపై అధికారులు క్లారిటీ ఇచ్చారని సమాచారం. దీంతో 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం లేదా 2020, అక్టోబర్ 24వ తేదీ ఆదివారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయని సమాచారం. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారని తెలుస్తోంది.

దసరా పండుగ సమీపిస్తోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు కానీ..తెలంగాణ – ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు నడవకపోతుండడంతో ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పలుసార్లు సమావేశమైనప్పటికీ.. ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు.




హైదరాబాద్‌లో జరిగిన ఈడీల సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కిలోమీటర్లు, రూట్లపై స్పష్టత రాకపోవడంతో బస్సులు తిప్పడంపై నిర్ణయానికి రాలేకపోయారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. తెలంగాణలో తమ బస్సులు తిరుగుతున్న దూరాన్ని తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది. లక్షా 60 వేల కిలోమీటర్లు మాత్రమే తిప్పుతామని ప్రతిపాదించింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు తెలిపారు.




అయితే రూట్లపై మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనిపైనే పీఠముడి పడింది. ఇప్పటికే కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు. ఇప్పుడు కూడా తిరగకపోతే ఆర్టీసీలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొత్తానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సర్వీసులను తిప్పే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరిగేలా కనిపిస్తోంది.