రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిశీలిస్తాం : ద్వివేది 

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 02:24 PM IST
రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిశీలిస్తాం : ద్వివేది 

పోలింగ్ కేంద్రాలపై రేపు స్క్రూటినీ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగిన గొడవలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని.. సీఈసీ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. రీపోలింగ్ నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. రీపోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారుల నుంచి నివేదికలు తీసుకుంటున్నామని..వాటిని పరిశీలిస్తామని తెలిపారు.

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలపై ఏడు కేసులు నమోదు చేశామని తెలిపారు. నక్సల్స్ ప్రాంతాలైన విజయనగరం, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో హింస లేదన్నారు. ఒక చోట హత్య జరిగిందని తెలిపారు. చిత్తూరులోని ఒక ప్రాంతంలో పోలింగ్ పూర్తిగా ఆగిపోయిందన్నారు. పలు చోట్ల ఓటింగ్ నెమ్మదిగా సాగిందన్నారు. సాయంత్రం 5 గంటలకు వరకు 66 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉందన్నారు.