కర్నూలు రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణం!

కర్నూలు రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణం!

Kurnool road accident : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టెంపో డ్రైవరే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున టెంపో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో.. డివైడర్‌ను క్రాస్ చేసి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. అటు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటు ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై లారీ-టెంపో ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదురుగు పురుషులు, చిన్నారి ఉన్నారు. ఇంకా ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల మధ్య చిక్కుకుపోయిన వారిని పోలీసులు బయటకు తీశారు. క్రేన్ సాయంతో సహాయక చర్యలను నిర్వహించారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి అజ్మీర్‌ వెళుతున్న టెంపో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 14 మంది స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మదనపల్లె వాసులుగా గుర్తించారు.

ఘోర ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లవారుజామున టెంపో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

గతంలోనూ వెల్దుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇదే ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – తుఫాన్ వాహనం ఢీకొన్న ఘటనలో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగింది. అందులోనూ బస్సు డ్రైవర్ అతివేగం కూడా ప్రమాదానికి కారణమైంది.

వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడమే కొన్ని ప్రమాదాలకు కారణమని.. వాహనాలు అతివేగంగా వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.

డ్రైవర్ల నిర్లక్ష్యమా? నిబంధనలు పాటించకపోవడమా? వరుస ప్రమాదాలపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న పాటి నిర్లక్ష్యానికి అటు అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు.