తిరుపతి ఉపపోరులో నిలిచేది బీజేపీ అభ్యర్ధేనా?

తిరుపతి ఉపపోరులో నిలిచేది బీజేపీ అభ్యర్ధేనా?

Tirupati by-elections : ఏపీలో వరుస ఎన్నికలు టెన్షన్ రేపుతున్నాయి. తిరుపతి ఎన్నికల కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీలు అభ్యర్ధులను సిద్ధం చేయగా.. బీజేపీ-జనసేన కూటమి మాత్రం ప్రకటించలేదు. మరి ఆ రెండు మిత్రపక్షాల్లో ఏ పార్టీకి ఛాన్స్ వస్తుంది? బీజేపీనే తిరుపతి ఉపపోరుకు ఎంపీ అభ్యర్ధిని ప్రకటిస్తుందా? లిస్టులో ఎవరెవరున్నారు? ఏపీలో ఇప్పడు పంచాయతీ ఎన్నికల కంటే తిరుపతి ఉపఎన్నికపైనే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.

స్థానిక పోరు పూర్తవగానే జరిగే ఉపఎన్నికకు వైసీపీ నుంచి అధికారికంగా ప్రకటన రాకపోయినా.. డాక్టర్ గురుమూర్తి పోటీ చేసే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయ్‌. ఆఖరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. టీడీపీ మాత్రం ఉపఎన్నిక కోసం పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసింది. త్రిముఖ పోరు ఉంటుందనుకుంటున్న తరుణంలో.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంట కొనసాగుతోంది.

తిరుపతి ఉపఎన్నిక కోసం తొలి నుంచి పదవీ విరమణ చేసిన అధికారులు, న్యాయమూర్తులను వెతుకుతోంది. గతంలో బీజేపీ తరుపున పోటీ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజయం సాధించారు. అదే సీన్‌ రిపీట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు రేసులో ముందున్నారు. చిత్తూరు జిల్లావాసి అయిన ఆయనకు.. బీజేపీ, సంఘ్‌పరివార్‌తో మంచి సంబంధాలున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంగా ఉన్న సమరసతా వేదికను ఆయనే నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ద్వారా హిందూ ధార్మిక ప్రచారం, ఆలయాల అభివృద్ధి, గో సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాసరి శ్రీనివాసులే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్ధి కావొచ్చేనే ప్రచారం జరుగుతోంది.

దాసరి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది రిటైర్డ్ అధికారుల పేర్లను కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి బాలయోగి తదితరుల పేర్లు బీజేపీ దృష్టిలో ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన రావెల కిషోర్‌ బాబు కూడా కమలం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. నిజానికి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ నేత పోటీలో ఉంటారనేది.. ఆ పార్టీ గ్రౌండ్ వర్క్‌ చూస్తుంటే అర్థమవుతోంది.