రథం దగ్ధమవడంలో కుట్ర ఉందా ? త్వరలో నిజాలు తెలుస్తాయి – మంత్రి సుచరిత

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 12:03 PM IST
రథం దగ్ధమవడంలో కుట్ర ఉందా ? త్వరలో నిజాలు తెలుస్తాయి – మంత్రి సుచరిత

రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు.




ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పాస్ ఔట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత హాజరయ్యారు. అంతర్వేది ఘటనపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని వెల్లడించారు.

రథం దగ్ధమైన ఘటనను సీబీఐకి అప్పగించామనే విషయాన్న గుర్తు చేశారామె. త్వరలో నిజనిజాలు నిగ్గు తేలుతాయన్నారు. కరోనా సమరంలో పోలీసులు కీలకంగా పనిచేశారని ప్రశంసించారు.




అమరులైన పోలీసులకు రూ. 50 లక్షల బీమా కల్పించడమే కాకుండా..హెల్త్ క్యాంపులను పెడుతున్నామన్నారు. దేశంలోనే తొలిసారి పోలీసులకు వీక్లీఆఫ్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే..చెప్పినట్లుగానే..సీబీఐకి ఈ కేసును అప్పచెప్పింది. ఈ మేరకు 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.



తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 6న స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఊహించని ఘటనతో భక్తకోటి నివ్వెరపోయింది. హిందూ ధార్మిక సంఘాలైతే ఆగ్రహంతో రగిలిపోయాయి.
https://10tv.in/chief-ministers-cm-order-for-cbi-probe-into-antarvedi-radham-incident/
నవనరసింహాస్వాముల్లో అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఒకరు. వశిష్ట గోదావరి, బంగాళాఖాతం సంగమ ప్రాంతంలో పశ్చిమముఖంగా నిర్మించిన ఈ ఆలయాన్ని నిర్మించడంతో, దేశం నలుమూల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.



స్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవడం, లేదంటే ఇంటి దగ్గర వివాహం చేసుకుని స్వామివారి సన్నిధిలో కళ్యాణవ్రతం చేసుకోవడం భక్తుల ఆనవాయితీ. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఆరు నెలలుగా పనిచేయడం లేదు. ఘటనకు కారణాలు ఎంటన్నది తెలియకుండా పోయింది.



క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? భక్తులు పెట్టే నిప్పుల కుంపటి నుంచి అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయా..? మతి స్థిమితం లేని వ్యక్తి రథాన్ని తగలబెట్టారా..? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఇప్పటిదాకా రథం దగ్ధం ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

మరి సీబీఐ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయో చూడాలి.