పూసపాటి రాజవంశంలో పూటకో వివాదం‌.. జగన్ ప్రభుత్వ వ్యూహమేంటి??

  • Published By: naveen ,Published On : November 20, 2020 / 10:59 AM IST
పూసపాటి రాజవంశంలో పూటకో వివాదం‌.. జగన్ ప్రభుత్వ వ్యూహమేంటి??

jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్‌ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిరాజు స్వీకరించినప్పటి నుంచి అమ్మవారి సిరిమానోత్సవంలో జరిగిన ఘటనల వరకు అంతా వివాదాలమయంగానే మారింది. ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచైత బాధ్యతలు స్వీకరించడమే ఒక సంచలనమైతే… ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ వివాదస్పదమే. దీని వెనుక చాలా అంశాలు దాగి ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

అది కుటుంబ వారసత్వ అంశం, ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణ:
చారిత్రక కట్టడం మూడులాంతర్ల కూల్చివేత, ప్రసిద్ధ ఎంఆర్‌ కళాశాల ప్రైవేటీకరణ అంశం.. తాజాగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరంలో సుధా, ఊర్మిళ గజపతులకు జరిగిన అవమానం.. ఇలా అన్నీ వివాదాలే. మాన్సాస్ ట్రస్టు చుట్టూ ఇన్ని వివాదాలు ముసురుకుంటున్నా…. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోందని అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. అది కుటుంబ వారసత్వ అంశమని, ప్రభుత్వానికి సంబంధం లేదని బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు అభిప్రాయపడుతున్నారు.

ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడంపై విమర్శలు:
మూడులాంతర్ల కట్టడాన్ని కూల్చివేసినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. అప్పుడు ఆధునికీకరణను అడ్డుకుంటారా అంటూ పాలకులు సర్దిచెప్పుకున్నారు. కోటపై నుంచి సుధా, ఊర్మిళ గజపతులను వెనక్కి పంపించడం గజపతుల సొంత వ్యవహారం కావచ్చు… కానీ, ప్రస్తుతం వేడెక్కిన ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన ఈ కళాశాలతో ప్రజల అనుబంధం విడదీయరానిదని అంటున్నారు.
https://10tv.in/suspense-over-local-body-elections-in-ap/
అయోమయంలో విద్యార్థి లోకం:
కళాశాలను ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ యాజమాన్యం ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతటితో ఆగకుండా ఎంఆర్ కళాశాలలో ఇంటర్ విద్యను రద్దు చేస్తూ ప్రభుత్వానికి మాన్సాస్ సంస్థ లేఖ ఇవ్వడం, వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలిస్తూ నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురిచేస్తోంది.

మంత్రి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం:
ఇంటర్ విద్యార్థులు సరే.. సుమారు 4వేల మంది ఉన్న డిగ్రీ విద్యార్థుల సంగతి ఏమిటన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. వారిని కూడా వేరే కళాశాలకు తరలిస్తారా? అలా తరలిస్తే… ఎంఆర్ కళాశాలను ఏం చేయబోతున్నారన్న ప్రశ్నలు ప్రతీ ఒక్కరిలో తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ట్రస్టు అంశం గజపతుల కుటుంబ సొంత వ్యవహారమంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదానికి ఊతమిస్తోంది:
ట్రస్టు వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే చైర్‌పర్సన్‌ నియామకం ఎలా చేశారు? ట్రస్టు వ్యవహారాలను పరిశీలించే బాధ్యతలను దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఎందుకు అప్పగించారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఏదో ప్రయోజనం ఆశించే ట్రస్టు వ్యవహారాలకు వెనుక నుంచి మద్దతిస్తున్నట్లు కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ట్రస్ట్‌ భూములన్నీ తిరిగి అనుభవించడానికే ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదానికి ఊతమిస్తోందని జనాలు అంటున్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు ఇలానే వ్యవహరించాయని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం వ్యూహం ఏంటి?
టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ట్రస్ట్‌ చైర్మన్‌ అశోకగజపతి రాజు కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని, ప్రజల్లో అపప్రదను మూటగట్టుకున్నారు. ఆ నిర్ణయాల జోలికి ప్రభుత్వం కూడా వెళ్లలేదు. ఇప్పుడు వైసీపీ సర్కారు కూడా అదే తీరుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. సంచైతను చైర్‌పర్సన్‌గా నియమించిన ప్రభుత్వం ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం వెనుక సుదూర ఆలోచన ఉందని అనుకుంటున్నారు. ట్రస్ట్‌ పరంగా ఏవైనా లోటుపాట్లు జరిగితే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవాలే తప్ప.. ఇలా తమ ప్రమేయం ఏమీ ఉండబోదనే సంకేతాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దీని వెనుక కుట్ర ఉందా?
సంచైత చైర్‌పర్సన్‌ అయిన తర్వాత ఎంతో విశిష్ట చరిత్ర ఎంఆర్ కళాశాలకు ప్రభుత్వ ఎయిడ్ ఎత్తివేసి, ప్రైవేటు కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. దీని వెనుక కుట్ర దాగి ఉందనేది ప్రజా సంఘాల విమర్శ. తమ సొంత ప్రయోజనాల కోసమే గజపతిరాజుల వారసులు మాన్సాస్ విద్యా సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఎయిడ్ ఎత్తివేస్తే సొంత ఆస్తిగా మారిపోతుందన్న ఆలోచనతోనే సంస్థాన వారసులు ఇలా వ్యవహరిస్తున్నారట. మరి ఈ విషయంలో ప్రభుత్వం ప్రజల విమర్శలకు సమాధానం చెబుతుందో లేదో అన్నది చూడాలి.