Jagananna Vidya Deevena : 11లక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్, ఖాతాల్లోకి డబ్బులు

జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.

10TV Telugu News

Jagananna Vidya Deevena : జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం రేపే(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు. ఇందుకోసం రూ.639 కోట్లను కేటాయించారు. దీని ద్వారా 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇప్పటికి ఈ స్కీమ్ కోసం రూ.5వేల 573 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. డిసెంబర్ లో మూడో దశ, నాలుగో విడత 2022 ఫిబ్రవరిలో అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు రూపకల్పన చేశారు. అందులో ఒకటి జగనన్న విద్యాదీవెన. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్‌ 19న రూ.671 కోట్లను జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,774 కోట్లతో సహా రేపు వేయబోయే విద్యా దీవెనతో మొత్తం రూ. 5వేల573 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం రూ.25వేల 714 కోట్లు ఖర్చు చేసింది.

జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడం వల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ‘సంక్షేమ మంత్రాన్ని’ వదలడం లేదు. ముందుగా చెప్పిన విధంగానే ఠంఛన్‌గా పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారు.

తల్లుల ఖాతాల్లోనే ఎందుకంటే..
* పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి ఫీజులు కట్టడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఆ కాలేజీల్లో సమస్యలు, వాటిలో ఉన్న పరిస్థితులు, సదుపాయాలు, అక్కడ తమ పిల్లల బాగోగులు గురించి తెలుసుకుని వసతుల లోపంతో పాటు సమస్యలేమైనా ఉంటే కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు.
* కాలేజీల్లోని సమస్యలను 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్ది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.
* కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీల్లో స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది.
* తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వారం, పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజును కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత ఫీజు చెల్లింపు నిలుపుదల చేస్తారు.

10TV Telugu News