అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 06:00 AM IST
అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కిట్లను ఆయన అందించనున్నారు.



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధిత మంత్రులు, అధికారులు స్టూడెంట్స్ కు కిట్లను అందచేయనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..నిబంధనలు పాటిస్తూ…కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు పంపిణీ చేస్తారు.విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సూచనల మేరకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



42,34,322 మంది విద్యార్ధులకు కిట్లను అందచేయనున్నారని అంచనా. ఈ పథకానికి రూ.650 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేస్తారు. అయితే..ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి.



బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు.
కిట్‌ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్, ఐరిష్‌ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. కిట్ ల విషయంలో ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.



ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి.
విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే.



నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..విద్యా కానుక కిట్ లు ముందుగానే అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది.