రాములోరి తీర్థంలో హీటెక్కిన రాజకీయం: సీన్‌లోకి బీజేపీ, జనసేన ఎంట్రీ!

రాములోరి తీర్థంలో హీటెక్కిన రాజకీయం: సీన్‌లోకి బీజేపీ, జనసేన ఎంట్రీ!

JanaSena and BJP:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం సాగుతోంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముల ఘటనపై రాజకీయాలు హీటెక్కాయి. రామతీర్థంలో హైటెన్షన్‌ కొనసాగుతుండగా.. చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఎంట్రీ తర్వాత.. రామతీర్థం కొండకు బీజేపీ, జనసేన పార్టీలు ఇవాళ(05 జనవరి 2020) వెళ్లడానికి సిద్ధం అయ్యాయి. హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలతో కలిసి రెండు పార్టీలు రామతీర్థం ధర్మ యాత్రకు నడుం బిగించాయి.

ఈ క్రమంలోనే బీజేపీ – జనసేన కార్యకర్తలు సిద్ధం కావాలంటూ ఇరుపార్టీలు పిలుపునివ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల విషయంలో ఉదాసిన వైఖరిని నిరసిస్తూ ధర్మయాత్ర పేరుతో నిరసనలు చెయ్యడానికి సిద్ధం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రామతీర్థం చేరుకోవడానికి రెండు పార్టీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. బీజేపీ నుంచి సోమువీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర ముఖ్యనేతలు, జనసేన నుండి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ముఖ్య నాయకులు ధర్మయాత్రలో భాగంగా రామతీర్ధంకి చేరుకోనున్నారు.

జనసేన, బీజేపీ సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో నిన్న, మొన్నటిదాకా ప్రశాంతంగా కనిపించిన రామతీర్థంలో హీటెక్కిన వాతావరణం కనిపిస్తోంది. సామాజిక చర్చలు, రాజకీయ విమర్శలు, ఆరోపణలన్నీ మతం, దేవుళ్ల చుట్టూ చేరగా.. రామతీర్థ ఘటనతో రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఎంట్రీ తర్వాత టీడీపీ అధినేత టార్గెట్‌గా వైసీపీ మంత్రులు ఆరోపణలు గుప్పించారు. అదేస్థాయిలో ప్రతిపక్ష నేతల నుంచి కౌంటర్‌ వచ్చింది.

ఇప్పడు బీజేపీ, జనసేనలు కూడా ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. మరోవైపు రామతీర్థంలో బీజేపీ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. బోడికొండ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.