AP municipal Election 2021 : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి..సీన్‌లో లేకుండా పోయాయి

AP municipal Election 2021 : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి..సీన్‌లో లేకుండా పోయాయి

Janasena Bjp

Janasena and BJP : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి.. సీన్‌ మార్చేస్తామంటూ చెప్పాయి.. కానీ.. సీన్‌లో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ, జనసేన ప్రభావం కనిపించకపోవడంతో.. ఆ రెండు పార్టీల కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు. పురపోరులో జనసేన-బీజేపీ కూటమి అడ్రస్ గల్లంతైందనే చెప్పాలి. ఈ రెండు పార్టీలు పొత్తులో వెళ్లినప్పటికీ… ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. చాలా చోట్ల బోణీ కూడా కొట్టలేకపోయిందీ కూటమి. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓటేసిన వార్డులో కూడా కూటమి అభ్యర్థి ఓడిపోయారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటూ వచ్చిన రెండు పార్టీలు… చివరికి వైసీపీ హవాను తట్టుకోలేక పోయాయి. పురపోరులో కేవలం కోనసీమ మినహా… మిగిలిన ప్రాంతాల్లో జనసేన ప్రభావం కనిపించలేదు. అమలాపురం మున్సిపాలిటీలో మాత్రమే జనసేన 5కు పైగా స్థానాలను గెలుచుకుంది. చివరికి విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా కేవలం ఒక్కస్థానం మాత్రమే జనసేన సొంతం చేసుకుంది. అది కూడా అక్కడ టీడీపీ మద్దతుతోనే. రాజధాని అమరావతి విషయంలో జనసేన-బీజేపీ నేతలు గతంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. అయితే కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం జోరుగా జరుగుతున్న విశాఖలో మాత్రం జనసేన-బీజేపీ కూటమి అనూహ్యంగా 5 స్థానాలను గెలుచుకుంది.

స్టీల్‌ ప్లాంట్ ఉద్యమంలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన మాత్రం చేశారు పవన్. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు.. బీజేపీ మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందనే చెబుతూ వచ్చింది. అయినప్పటికీ విశాఖలో జనసేనకు నాలుగు, బీజేపీకి ఒక స్థానం దక్కాయి. కానీ రాజధాని రైతులకు మద్దతుగా ధర్నాలు, నిరసనలు చేసినా.. గుంటూరులో మాత్రం ఆ పార్టీకి ఆదరణ దక్కలేదు. అటు బీజేపీతో పొత్తు వల్లే ఓడినట్లు జనసేన నేతల అభిప్రాయం. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా… ఈ ఎన్నికల్లో విజయం సాధించే వాళ్లమంటున్నారు. బీజేపీతో పొత్తు కారణఁగా… చాలా చోట్ల సీట్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగినట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించలేదు. పవన్ ప్రచారం చేసి ఉంటే మరికొన్ని స్థానాలు దక్కి ఉండేవంటున్నారు కార్యకర్తలు.

ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన-బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచింది తక్కువే. కేవలం తూర్పు గోదావరి జిల్లాలో మినహా… మిగిలిన చోట్ల ఘోరంగా ఓడిపోయారు. అటు అసెంబ్లీలో కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత… తమపై ప్రభావం చూపిందనేది జనసేన నేతలు, కార్యకర్తల మాట. భవిష్యత్తులో కూడా ఇలాగే ముందుకు వెళ్తే… రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓటమిపై కారణాలు విశ్లేషించి… సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని జనసేన నేతలు సూచిస్తున్నారు. బీజేపీ మాత్రం ఈ ఫలితాలతో నిరాశలో కూరుకుపోయింది. గెలవడం సంగతి అటుంచితే.. చాలా స్థానాల్లో పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో అంతర్మథనం చెందుతున్నారు కమలనాథులు.