కమల పవనాలు : బీజేపీ – జనసేన కలిస్తే..రాజకీయం మారుతుందా

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 12:40 AM IST
కమల పవనాలు : బీజేపీ – జనసేన కలిస్తే..రాజకీయం మారుతుందా

బీజేపీ, జనసేన కలిస్తే ఏపీ రాజకీయం మారుతుందా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఏపీలో ఆసక్తికరమైన రాజకీయ మలుపు 2020, జనవరి 16వ తేదీ గురువారం చోటు చేసుకోబోతోంది. ఉదయం 11గంటలకు జనసేన, బిజెపి నేతలు విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో సమావేశం కాబోతున్నారు. బీజేపీ తరపున సునీల్ దేవ్‌ధర్‌, కన్నా లక్ష్మీనారాయణ, జివిఎల్ నరసింహారావు సహా ముఖ్యమైన నేతలు పాల్గొంటారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు.

 

ఈ సమావేశానికి ముందుగా ఇరు పార్టీల అగ్రనేతలు వారి ముఖ్యమైన నేతలతో వేర్వేరుగా సమావేశం అవుతారు. తర్వాత ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు. రాజధాని అంశం, రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం, మహిళలపై దాడులు లాంటి అంశాలపై  ఉభయ పార్టీలు చర్చించి ఉమ్మడి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. బీజేపీ, జనసేనలు సంయుక్తంగా వైసీపీపై పోరాటానికి సన్నద్దం అవుతున్నాయి. ముఖ్యంగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించడానికి కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని వేగం పెంచేలా చేయబోతున్నాయి.

 

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను కార్యాచరణలోకి తేవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోన్న తరుణంలో బీజేపీ, వైసీపీలు చేసే పోరాటం ఎంతవరకూ ఫలిస్తుందనేది ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. రిపబ్లిక్ డే వేడుకలను సైతం విశాఖపట్నంలోనే నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమైంది. పరిపాలనా రాజధాని కోసం విశాఖలో అన్ని ఏర్పాట్లకు సిద్దమైన పరిస్థితుల్లో… ఉభయ పార్టీల కలయిక ఎటు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Read More : కోడి పందాల్లో విషాదం : కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి

 

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కన్పిస్తున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా ప్రజాసమస్యలపై పోరాటం చేసినా, పెద్దగా ఫలితాలు రాలేదు. గడిచిన ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు కన్పించలేదు. వాస్తవానికి బీజేపీకి రాష్ర్టంలో పెద్ద పట్టు లేదు. కేడర్ కూడా నామమాత్రమే. జనసేనకు అభిమానులు ఉన్నారు గానీ, ఓటర్లు లేరు. ఆ విషయం 2019 ఎన్నికల్లో నిరూపణ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై అంచలంచెలుగా పోరాటానికి దిగుతున్నారు. మధ్యలో విరామం ప్రకటిస్తున్నారు. సమగ్రమైన కార్యాచరణ లేదు.

 

2014 నుంచి ప్రత్యక్ష రాజకీయల్లో వపన్ ఉన్నప్పటికీ కేడర్‌ను అభివృద్ధి చేయడంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ర్టంలో మూడు రాజధానుల ప్రతిపాదన అందివచ్చింది. దీన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకునే ప్రయత్నంలో చాలా వరకూ ముందుకు వెళ్లింది. విషయాన్ని గమనించిన బీజేపీ, జనసేనలు మేల్కొన్నాయి. దీంతో కలిసి పనిచేస్తే ప్రజా మన్నన పొందవచ్చనే నిర్ణయానికి వచ్చాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజామన్నన పొందడానికి ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కింది వర్గాలను చేరువ చేసుకోవడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో వైసీపీ ఇప్పట్లో ఎవరూ ఏమీ చేయలేరనే భావన కల్పించారు. కానీ మూడు రాజధానుల ప్రతిపాదన ఒక్కసారిగా మంటలు రగిల్చింది. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన తర్వాత… ముందుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఉద్యమం ఆరంభం అయింది.

 

రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే దీన్ని వైసీపీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలని యత్నించి విఫలమైంది. ఒక వర్గం చేసే పోరాటం అని, తెలుగుదేశం పార్టీ చేయిస్తోందని నమ్మించే యత్నం చేసింది. అయితే తర్వాత చంద్రబాబును అరెస్టు చేయడం, అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను అడ్డుకోవడం… మహిళలను చితకబాదడం, రైతులపై కేసులు నమోదు చేయడం లాంటి అంశాలన్నీ ఉద్యమాన్ని రాష్ర్టస్థాయికి తీసుకెళ్లాయి. దీంతో అన్ని పార్టీలూ స్పందించాయి. పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు.

 

బిజేపీ సైతం ఉద్యమానికి సానుకూలంగా స్పందించింది. పాలన కాదు, అభివృద్దిని వికేంద్రీకరించాలని డిమాండ్ చేస్తోంది.. బీజేపీ కోర్ కమిటీలో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం కూడా చేసింది. తాజాగా జనసేన – బీజేపీ పార్టీలు జరిపే మీటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.