కొత్త చెలిమి : కమలం-జనసేన కలసి పయనం! 

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 12:30 PM IST
కొత్త చెలిమి : కమలం-జనసేన కలసి పయనం! 

చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరి పోరు సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక లాభం లేదనుకొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాగస్వాములుంటేనే బెటర్ అనుకున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారు. కలసి సాగాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు జనసేనతో బీజేపీకి… బీజేపీతో జనసేనకు రాజకీయ అవసరాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే పవన్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధపడింది. అలాగే బీజేపీతో నడిచేందుకు పవన్‌ కూడా ఇష్టపడుతున్నారు. మళ్లీ పాత చెలిమిని కొనసాగించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. దీనివల్ల ఉభయులకూ మేలు జరుగుతుందని అనుకుంటున్నాయి. ఈ కలయిక అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో ఎవరికి నష్టం వాటిల్లుతుంనేదే ఇప్పుడు చర్చ. 

రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయించుకున్నాయి. ఇక నుంచి ఏపీలో జరిగే అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగానే చేయాలనే అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంలో ఇదే అంశాన్ని చర్చించారని అంటున్నారు. రెండు పార్టీల బలాలు, బలహీనతలపై చర్చించుకున్న తర్వాత ఉభయులూ ఒక నిర్ణయానికి వచ్చారట. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఉభయులూ సీరియస్‌గానే చర్చించుకున్నారు. అమరావతి అంశం ప్రధానంగా ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. 

ఆ రెండు పార్టీలకు దూరంగా :
జనసేన అధినేత పవన్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు అండగా నిలిచారు. వారి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అప్పట్లో ఆ రెండు పార్టీలు లబ్ధి పొందాయి. అటు బీజేపీ అగ్రనేతలతో, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ పవన్‌కు మంచి సంబంధాలున్నాయి. 2014 ఎన్నికల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో రైతుల నుంచి భూముల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటున్న చంద్రబాబు విధానాన్ని పవన్ తప్పుబట్టారు. రైతులకు అండగా నిలవడానికి ఆ సమయంలో రాజధాని ప్రాంతంలో రైతులతో సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆ రెండు పార్టీలకు పవన్‌ దూరమయ్యారు. 

ఒంటరి పోరాటం కాదని :
2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఒకే ఒక్క ఎమ్మేల్యే స్థానాన్ని దక్కించుకుంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే రాపాక ప్రసాదరావు కూడా ఇపుడు జనసేనకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలో చేరడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు తెలుగుదేశం పైనా, ఇటు జనసేన పైనా వైసీపీ విమర్శల దాడులు పెంచింది. మరో వైపు రాజధాని అంశం ఇపుడు కీలకంగా మారింది. దీంతో ఒంటరి పోరాటం సాధ్యం కాదని పవన్ భావిస్తున్నారట. బీజేపీ అండ ఉంటేనే పరిస్థితులు చక్కబడతాయిని అనుకుంటున్నారట. అందుకే బీజేపీ నేతల్ని నేరుగా కలిసి మంతనాలు జరిపారు.

మూడు పార్టీలు కలయిక తథ్యమే? :
బీజేపీ కూడా అమరావతి రాజధాని విషయంలో స్పష్టంగానే ఉంది. అభివృద్ధిని వికేంద్రీకరించాలి తప్ప పాలనను కాదనే నినాదంతో బీజేపీ అడుగులు వేస్తోంది. మరోపక్క ఈ విషయంలో టీడీపీ కూడా అమరావతికి కట్టుబడి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు కూడా పదే పదే పవన్‌ కల్యాణ్‌ను వెనకేసుకు వస్తున్నారు. వైసీపీని విమర్శించిన ప్రతి సందర్భంలో పవన్‌ పేరు ప్రస్తావిస్తున్నారు. దీంతో మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయనే ప్రచారం జరుగుతోంది. రైతులకు ఉద్యమానికి చంద్రబాబుతో పాటు పార్టీలు అండగా నిలబడుతున్నాయి. అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన తిరిగి కలుస్తాయని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు మరోసారి మూడు పార్టీల కలయిక తథ్యమనే ప్రచారానికి ఊపునిస్తున్నాయి. 

చంద్రబాబు ముందుగా స్పందించారు. అమరావతి పరిరక్షణ సమితి చేసే పోరాటాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 46 సంఘాలు కలిసి ఏర్పడి అమరావతి రాజధాని కోసం చేసే పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. దీన్ని చంద్రబాబు నాయకత్వం వహించే స్థాయికి తీసుకొచ్చారు. సేవ్ అమరావతి పేరిట చేసే పోరాటాలు టీడీపీకి మంచి మైలేజీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో జనసేన వెనుకబడిపోయింది. దీంతో బీజేపీతో కలసి అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే నిర్ణయానికి పవన్ వచ్చారు. ఫలితంగానే బీజెపీతో చెలిమికి మళ్లీ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ-జనసేనల కలయిక వల్ల రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఇరు పార్టీల ప్రభావం ఏపీలో పెద్దగా లేదు. పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు జనం వస్తున్నారే గానీ… ఓట్లు రాలడం కష్టమేనని మొన్నటి ఎన్నికలతో తేలిపోయింది. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా పట్టు లేని పరిస్థితి. ఇరు పార్టీలకూ రాజకీయంగా పెద్ద ఉపయుక్తం లేదనే చెప్పాలి. ప్రస్తుతం కలసి పని చేస్తే మాత్రం కొంత వరకూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. పాతమిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురించడానికి ఇదే కారణం అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితుల దృష్ట్యా.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా కలిసి పని చేయాలని జనసేన-బీజేపీ నిర్ణయించాయి.