ఒంటరి పోరులో దెబ్బతిన్నాం.. ఈసారి బీజేపీతో లోకల్లో అదరగొడతాం!

  • Published By: sreehari ,Published On : March 11, 2020 / 09:16 AM IST
ఒంటరి పోరులో దెబ్బతిన్నాం.. ఈసారి బీజేపీతో లోకల్లో అదరగొడతాం!

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్‌కు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఈ వార్‌లో ఈ రెండు పార్టీల సంయుక్త వ్యూహం ఏంటి?.. గత ఎన్నికల్లో దెబ్బతిన్నాం… స్టానిక సంస్థల్లోనైనా సత్తా చాటుదాం… అంటూ ఎన్నికల క్షేత్రంలోకి దూకాయి బీజేపీ, జనసేన పార్టీలు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తరువాత వచ్చిన మెదటి ఎన్నికలు కావడంతో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు పార్టీల నుంచి రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇక గ్రౌండ్ లెవల్‌లోనూ రెండు పార్టీలను సమన్వయం చేసుకునేందుకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారిగా కోఆర్డినేటర్లను నియమించిన ఇరు పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వాహణ బాధ్యతలు మొత్తం వారికే అప్పగించారు. వైసీపీ 9 నెలల పాలనలో చేసింది శూన్యమని, తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలే అని బీజేపీ, వైసీపీ నేతలు అంటున్నారు.

టీడీపీ, వైసీపీ పాలనలో రాష్ట్రానికి ప్రయోజనం లేదని.. బీజేపీ, జనసేనే రాష్ట్రానికి ప్రత్యేమ్నాయం అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సపోర్టు కావాలంటున్నారు కమలనాథులు. ఇదే అజెండాతో లోకల్ వార్‌కు సిద్ధమయ్యాయి బీజేపీ, జనసేన. ఒక పక్క వైసీపీ, టీడీపీలు గ్రౌండ్ లెవల్ నుంచి బలంగా ఉండటమే కాకుండా ఎన్నికలకు పెద్ద ఎత్తున వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతలంతా క్షేత్ర స్థాయిలో తిరుగుతూ అభ్యర్థులను సైతం ఖరారు చేశారు. చాలా వరకూ నామినేషన్ల పక్రియ కూడా ప్రారంభించేశారు. అయితే జనసేన, బీజేపీలు మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, జనసేన స్థానిక సమరంలో కలిసి వెలుతున్నాయి. వీరి పొత్తులు ఎలాంటి ఫలితాలను సాధిస్తాయో చూడాలి.

See Also | ఎమ్మెల్యేలకు జగన్ షాక్, స్థానిక ఎన్నికల్లో మీ బంధువుల‌కు బీ-ఫామ్ ఇవ్వం, కార్యకర్తలకే సీట్లు