Janasena Pawan : పవర్ పంచ్.. వైసీపీకి జనసేనాని పవన్ సవాల్..

వైసీపీ నాయకులకు జనసేనాని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. శంకరంబాడి సర్కిల్ వద్ద జనసేన బహిరంగ సభలో అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Janasena Pawan : పవర్ పంచ్.. వైసీపీకి జనసేనాని పవన్ సవాల్..
ad

Janasena Pawan Kalyan : వైసీపీ నాయకులకు జనసేనాని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. శంకరంబాడి సర్కిల్ వద్ద జనసేన బహిరంగ సభలో అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ గుండాకైనా ఎంతకాలం భయపడతామన్నారు. భయపెట్టేవారికి పవన్ కల్యాణ్ భయపడడని అన్నారు. పులివెందుల అంటే దుర్మార్గానికి మారుపేరుగా మారిందని విమర్శించారు.

సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే.. మిమ్మల్ని రోడ్డుపైకి ఈడ్చే రోజులు వస్తాయని గుర్తించాలని చెప్పారు. అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి వేయనని పవన్ స్పష్టం చేశారు. భావితరాలకు ఆదర్శం కావాలనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని జనాసేనాని ప్రశ్నించారు. మీలా సిమెంట్ ఫ్యాక్టరీలు నాకు లేవన్నారు. మీ ప్రతాపం సామాన్యులపై కాదు.. దమ్ముంటే నాపై చూపండని సవాల్ విసిరారు. అడ్డగోలు సంపాదన కోసం రాజకీయాలు చేయనని హితవు పలికారు. ఏపీ దశ, దిశ మారాలి.. స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు.

తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచించి ఓటేయాలన్నారు. ఏపీలో అధికారం బదలాయింపు జరగాలన్నారు. రత్నప్రభ గెలిస్తే మన సమస్యలను చెప్పుకోవచ్చునని తెలిపారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదన్నారు. సీఎం పదవి వచ్చినా రాకపోయినా నా కడ శ్వాసవరకు ప్రజలకు సేవ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. మనమంతా కలిసి వైసీపీకి బలమిచ్చామన్నారు. వైసీపీ నాయకులు పిచ్చి వేషాలు వేస్తామంటే కుదరదన్నారు. కొందరు నాయకులు ప్రజలను పీడుస్తున్నారని మండిపడ్డారు. దేశానికి మనమేం ఇచ్చామన్నదే ముఖ్యమని తెలిపారు. కోట్లు సంపాదిస్తాను.. కోట్లు పన్ను కడతాను.. కోట్లు జనాలకు ఇస్తానని పవన్ పేర్కొన్నారు.

జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ తరఫున పవన్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి ఎమ్మార్‌పల్లి సెంటర్‌ వరకు పవన్‌ ర్యాలీకి అభిమానులు పూలతో నీరాజనాలు పలికారు. ఎమ్మార్‌పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్‌ వరకు పాదయాత్ర చేసిన పవన్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. పాదయాత్ర సాగడం కష్టంగా ఉండటంతో.. మార్గమధ్యలోనే పవన్‌ను కారులోకి ఎక్కించారు పోలీసులు.

ప్రజల సొమ్మును కాజేసే వ్యక్తిని కానని అన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని విమర్శించారు. దమ్ముంటే పవన్ పై ప్రతాపం చూపాలని సవాల్ విసిరారు. సేవ చేసుకునే అవకాశం వస్తే అందరికంటే బాగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి వస్తే అందరి కంటే ఎక్కువ పనిచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఓటుకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నారని పవన్ ఆరోపించారు.