రైతుల కోసం పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష

  • Published By: vamsi ,Published On : December 7, 2020 / 12:21 PM IST
రైతుల కోసం పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారంగా తక్షణమే రూ. 10వేలు సాయంగా అందించి మొత్తంగా రూ.35వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ దీక్షలో కూర్చొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతులకు మద్దతుగా తన ఇంట్లో 10 గంటలకు దీక్షలో కూర్చున్నారు పవన్ కళ్యాణ్.



నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి 48గంటల గడువు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని జనసేన పిలుపునివ్వగా.. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా దీక్షలో చేస్తున్నారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న పవన్ కళ్యాణ్.. నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడం కోసం, ధైర్యం చెప్పడం కోసం.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.



నివర్ తుఫాన్ వల్ల రైతులు పంటలు నష్టపోయారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ, రైతులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రైతులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించగా.. ఈ క్రమంలోనే దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.