ఢిల్లీకి వెళ్లిన జనసేనాని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్న పవన్

ఢిల్లీకి వెళ్లిన జనసేనాని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్న పవన్

Janasenani Delhi tour  : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని.. జనసేనాన్ని కేంద్రం పెద్దలను కోరనున్నారు. అలాగే.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీ వెళ్లారు.

ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్‌ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో తెలిపారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ ఫ్యాక్టరీ వచ్చిందని జగన్‌ తన లేఖలో తెలిపారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని.. నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడంతో ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనుల్లేవని జగన్‌.. ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ప్రాణాలు అర్పించి కర్మాగారాన్ని సాధించుకున్నామని.. ఆవిధంగానే ప్రాణాలు ఒడ్డైనా ప్లాంట్‌ను రక్షించుకుంటామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతుందని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నాయి. స్టీల్‌ప్లాంటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్‌ ప్లాంటు అనగానే మాతృ సంస్థగా, అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్‌నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.

స్టీల్‌ప్లాంట్‌లో శాశ్వత ఉద్యోగులు 17 వేల మంది వరకు ఉండగా, కాంట్ర్టాక్టు కార్మికులుగా మరో 20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటైన వందలాది చిన్నతరహా పరిశ్రమలపై మరో లక్ష మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖలో అన్నిరకాల వ్యాపారాల్లోనూ స్టీల్‌ ప్లాంటు ఉద్యోగుల లావాదేవీలు 10 శాతం వరకు ఉంటాయి. నెలకు ఎలా లేదన్నా 200 కోట్లు స్టీల్‌ ప్లాంటు నుంచి విశాఖ మార్కెట్‌లోకి వస్తుంది. అలాంటి సంస్థను ప్రైవేటుపరం చేస్తే.. విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.